రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

ఆసిఫాబాద్‌: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ కె.హరిత అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, అధికారులతో కలిసి హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మార్క్‌ఫెడ్‌ ద్వారా జైనూర్‌, కాగజ్‌నగర్‌, కౌటాల మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 900 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. 40 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, 9 చోట్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దహెగాం, లగ్గాం, ఒడ్డుగూ డ, గిర్‌వెల్లి, చంద్రవెల్లి, సాలిగాం, దుబ్బగూడ, వీరవెల్లి, గుడ్లబోరి, సిర్పూర్‌–టి, సీతానగర్‌, రవీంద్రనగర్‌ కేంద్రాలకు ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో గోనె సంచుల కొరత లేదని, స్థానిక రైతుల వద్ద ఉంటే డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల హమాలీలపై ఆధారపడకుండా స్థానికులను వినియోగించుకోవాలన్నారు. ప్రతీ కేంద్రానికి వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ విస్తరణ అధి కారులను బాధ్యులుగా నియమించాలని, జిల్లాస్థాయి అధికారులు తమ పరిధిలోని కేంద్రాలను ప్రతిరోజూ సందర్శించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. డీఆర్‌డీవో దత్తారావు, సహకార శాఖ అధికారి మోహన్‌, ఆర్టీవో రాంచందర్‌, మార్కెటింగ్‌ అధికారి అశ్వక్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement