పశువుల అక్రమ రవాణాపై నిఘా | - | Sakshi
Sakshi News home page

పశువుల అక్రమ రవాణాపై నిఘా

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

● రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా ● అంతర్రాష్ట్ర పోలీస్‌ల సమావేశం

జైపూర్‌: పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, సరిహద్దు భద్రత పటిష్టతపై మంచిర్యాల జిల్లా జైపూర్‌ అసిస్టెంట్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో మంగళవారం అంతర్రాష్ట్ర పోలీసు అధికారుల సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో పశువుల మార్కెట్లపై ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమ రవాణా, నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, రెవెన్యూశాఖలతో సమన్వయం చేసుకుని తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతరం సమాచార మార్పిడి కొనసాగాలని అన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకునేందుకు పోలీస్‌శాఖ అప్రమత్తంగా పని చేస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జిల్లాల పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement