ఇదేం ‘పరీక్ష’! | - | Sakshi
Sakshi News home page

ఇదేం ‘పరీక్ష’!

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

● నీట్‌ రద్దుపై విద్యార్థుల్లో ఆందోళన ● పటిష్ట చర్యలు తీసుకోవాలని విన్నపం

భవిష్యత్‌లో డాక్టర్‌ కావాలనే ఎన్నో ఆశలతో నీట్‌ రాసిన విద్యార్థులపై ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది. పరీక్ష రద్దుతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెండేళ్లు కష్టపడి పరీక్ష రాస్తే ఒక్కసారిగా రద్దు చేయడం మానసిక వేదనకు గురి చేస్తోందని వాపోయారు. ప్రశ్నపత్రాలు లీక్‌ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

– మంచిర్యాలఅర్బన్‌/నిర్మల్‌రూరల్‌

మానసిక ఒత్తిడి పెరుగుతుంది

మళ్లీ నీట్‌ రాయమనడంతో మాపై మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. రెండేళ్లు కష్టపడి మొన్ననే పరీక్ష బాగా రాసాం. మార్కులు కూడా బాగానే వస్తున్నాయి. కానీ ఒక్కసారిగా రద్దుచేసి మళ్లీ పరీక్ష రాయమంటే భయమేస్తోంది. హైదరాబాద్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో ఉండి చదువుకున్నాం. మళ్లీ అక్కడికి వెళ్లి చదవాలంటే దూర భారంతోపాటు వ్యయప్రయాసలు పడాల్సిందే. ఒక రాష్ట్రంలో లీకై తే దేశ మొత్తం మంది విద్యార్థులను బలి చేయడం అన్యాయం.

– మంగ్లారపు నక్షత్ర, నిర్మల్‌

రద్దుతో నిరాశ

ఎంబీబీఎస్‌ సీటు సంపాదించుకోవాలని తల్లిదండ్రులు, నా కల. నేను రెండేళ్లుగా ఎంతో కష్టపడ్డాను. తీరా చూస్తే నీట్‌ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధాకరంగా మారింది. నీట్‌ పేపర్‌ లీకేజీ కావడం అత్యంత బాధాకరం. ఇలాంటి చర్యల వల్ల మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. నీట్‌ పేపర్‌ లీకేజీ పునరావృతం కాకుండా చూడాలి. మళ్లీ పరీక్షలు రాయాలంటే కొంత మేర ఇబ్బందిగా చెప్పవచ్చు.

– ప్రాణహిత, నీట్‌ విద్యార్థిని, మంచిర్యాల

రాత్రింబవళ్లు కష్టపడ్డాను

రెండేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ కష్టపడి చదివాను. తెల్ల కోటు వేసుకోవాలనే ఆశతో నీట్‌కు సిద్ధమయ్యాను. ఎన్‌టీఏ పరీక్ష రద్దుతో నిరాశ నెలకొంది. నీట్‌ పేపర్‌ లీక్‌ అయిందని చెప్పడంతో ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యాను. తల్లిదండ్రులు కూడా ఇబ్బందికి గురయ్యారు. పేపర్‌ లీక్‌ అనేది బాధాకరం. మళ్లీ పరీక్ష రాయాలంటే ఎన్నో ఇబ్బందులుంటాయి. అంతా సంతోషంగా ఉంటామని అనుకున్నా నేపథ్యంలో పరీక్షలు రద్దుకావడం బాధాకరం.

– నేహ అంజుం, నీట్‌ విద్యార్థిని, మంచిర్యాల

Advertisement
 
Advertisement
Advertisement