చింతలమానెపల్లి: జిల్లాలో నూతన చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా అక్రమార్కులు ఏమాత్రం బెదరకుండా పశువులను అక్రమంగా తరలిస్తున్నారు. చెక్‌పోస్టులు, తనిఖీలను లెక్కచేయకుండా దందాను కొనసాగిస్తున్నారు. ఇటీవల చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద జరిగిన ఘటన అక్రమార్కుల బరితెగింపును తెలియజేస్తోంది. జిల్లాలో స్మగ్లింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు శాఖ పలు ప్రాంతాల్లో నూతనంగా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ప్రజల సహకారం, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. చింతలమానెపల్లి మండలం గూడెం, వాంకిడి, సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట, సి ర్పూర్(టి)లతోపాటు అదే మండలంలోని పెద్దబండ, చింతలమానెపల్లి మండలం డబ్బా క్రాస్ రోడ్, బెజ్జూర్ మండలంలోని సలుగుపల్లి క్రాస్‌రోడ్, కాగజ్‌నగర్ రూరల్ వంజీరి, దహెగాం మండలం కల్వాడ, జైనూర్‌లోని రాణి దుర్గావతి చౌక్, వాంకిడి టోల్‌ప్లాజా, ఆసిఫాబాద్ మండలం గుండి, రెబ్బెన మండలం కొమురవెల్లి, తిర్యా ణి మండలం ఎగ్గండిల వద్ద కొత్తగా చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఈ 11 చెక్‌పోస్టుల వద్ద తనిఖీల కోసం సిబ్బందిని నియమించారు.
బరితెగించి తరలింపు..
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్రకు సరి హద్దున ఉంది. కౌటాల పశువుల సంతకు గడ్చిరోలి జిల్లాలోని అహేరి, ఆళ్లపల్లి, చంద్రపూర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మూగజీవాలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. వాంకిడి మండలంలోని సోనా పూర్‌కు చంద్రాపూర్ జిల్లా నుంచి పశువులను తరలిస్తుంటారు. ఈక్రమంలో ప్రత్యేక చెక్‌పోస్టుల ద్వారా వ్యాపారాలను అడ్డుకోవడం అక్రమార్కుల కు మింగుడు పడడం లేదు. బరి తెగిస్తూ తనిఖీలు చేసే క్రమంలో వాహనాలు ఆపకుండా వెళ్లిపోతున్నారు. అయితే పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రజలు, సంస్థలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సమాచారాన్ని అధికారులకు అందించి సహకరించాలని కోరుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు ప్రచారం చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత
దహెగాం: మండలంలోని రాంపూర్ నుంచి బెల్లంపల్లి వైపు అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని సోమవారం కర్జి సమీపంలో పట్టుకున్నామని ఎస్సై చుంచు రమేశ్ తెలిపారు. మూడు ఎద్దులను స్వాధీనం చేసుకుని ఎండీ సోహెల్, ఎండీ రహీదుద్దీన్, జహీర్‌పై కేసు నమోదు చేశామన్నారు.
చింతలమానెపల్లి మండలం గూడెం గ్రామం వద్ద సరిహద్దు చెక్‌పోస్ట్‌లో శనివారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహిండగా ఓ లారీలో నిబంధనలకు విరుద్ధంగా పశువులు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇందులో 37 ఆవులు, రెండు దూడలు స్వాధీనం చేసుకున్నారు. మరో లారీని ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా ముందుకెళ్లిపోయాడు. ఎస్సై జీవన్ మార్గంలోని గ్రామాలకు సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో రెండో లారీని ఖర్జెల్లి గ్రామం వద్ద పట్టుకున్నారు. రెండు లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి పదిమందిపై కేసు నమోదు చేశారు.


