రోడ్డు విస్తరణ పనుల్లో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

రోడ్డు విస్తరణ పనుల్లో ఉద్రిక్తత

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

● కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య వాగ్వాదం

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని ప్రధాన రహదారుల విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి ఇరువైపులా రహదారిని విస్తరించేందుకు అధికారులు సోమవారం చర్యలు ప్రారంభించారు. రహదారికి అడ్డుగా ఉన్న దుకాణాలను జేసీబీ సాయంతో తొలగించేందుకు సిద్ధమవుతుండగా, అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధి పనులను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. అరగంట పాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ స్తంభించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటన స్థలానికి డీఎస్పీ వహీదుద్దీన్‌ చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. పోలీసుల బందోబస్తుతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు.

పనులు త్వరగా ప్రారంభించాలి

రాజీవ్‌ గాంధీ చౌరస్తా నుంచి రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, రైల్వే గేటు వరకు రోడ్డుకు ఇరువైపులా రోడ్డు విస్తరణ పనలను త్వరగా చేపట్టాలని వ్యాపారులు డిమాండ్‌ చేశారు. దుకాణాల ఎదుట శిథిలాలు ఉండటంతో వినియోగదారులు రాకపోవడంతో వ్యాపారం దెబ్బతింటుందని వాపోయారు. నిధుల లేమితో అర్ధంతరంగా పనులు నిలిపివేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement