ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల, కాగజ్‌నగర్ ఏరియా ఆస్పత్రితోపాటు సీహెచ్‌సీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ డీఎంఈ, టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా సకాలంలో వేతనాలు అందడం లేదన్నారు. ఏజెన్సీలు కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించి, ప్రతినెలా 5లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెట్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, డీసీహెచ్‌ఎస్ అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. నాయకులు దేవ్‌రావ్, మారుతి, ప్రవీణ్, సాయి, లలిత, కళావతి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.


