మొండి ‘చేయి’! | - | Sakshi
Sakshi News home page

మొండి ‘చేయి’!

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

ఉమ్మడి జిల్లాకు దక్కని నామినేటెడ్‌ పోస్టులు

పార్టీ మారిన మాజీ ప్రజాప్రతినిధులకు నో ఛాన్స్‌

మరోసారి ‘హస్తం’ పార్టీ సీనియర్లకు నిరాశే

కేడర్‌కు ‘చేయి’ఇచ్చేవారేరి?

స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కోసం కష్టపడుతున్న వారికోసం అధిష్టానాన్ని ఒప్పించి నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం కల్పించాలని కేడర్‌ కోరుతోంది. ఇక కొందరు తమ బయోడేటాను గాంధీ భవన్‌తో సహా ఢిల్లీ వరకు పంపించారు. అయితే తమకు పదవులు వచ్చేలా స్థానిక ప్రజాప్రతినిధులే చొరవచూపాలని కోరుతున్నారు. త్వరలో భర్తీ చేయబోయే ఉమ్మడి జిల్లా సహకార శాఖలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్లు, డివిజన్‌ స్థాయి మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, మండల, గ్రామస్థాయిలో ప్రాథమిక సహకార సంఘాల్లో నియామకంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాలో ‘హస్తం’పార్టీ నేతలకు నామినేటెడ్‌ పదవుల్లో నిరాశే మిగిలింది. ఇటీవల ప్రకటించిన పదవుల్లో ఏ ఒక్కరికీ అవకాశం దక్కక అనేక మంది సీనియర్లు నారాజ్‌లో ఉన్నారు. అసంతృప్తి చెందిన నాయకులు ఇటీవల ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ‘జూపల్లి’ దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లకు పదవుల్లో అవకాశం ఉంటుందని ఆశించిన వారందరికీ భంగపాటే ఎదురైంది. ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీ అధ్యక్ష పదవులు ఆశించిన వారితో పాటు ఆదివాసీ, మహిళా, కార్మిక, రైతు, యువ నాయకులతో సహా సీనియర్లు ఉన్నారు.

ఆశావహులు అనేకం

ఉమ్మడి జిల్లాలో అనేక మంది సీనియర్లు పదవుల పై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, ఆసిఫాబాద్‌ ని యోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న శ్యామ్‌నాయక్‌, ఓ యూ విద్యార్థి నాయకుడు దుర్గం భాస్కర్‌ ఆశావహుల్లో ఉన్నారు. నిర్మల్‌లో డీసీసీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పాటిల్‌, మంచిర్యాల జిల్లాలో కేవీ ప్రతాప్‌, డా.నీలకంఠేశ్వర్‌రావు, నూకల రమేశ్‌, న్యాతరి స్వా మి, తదితర యువ నాయకులు ఉన్నారు. ఆదిలా బాద్‌ జిల్లాలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కంది శ్రీనివా స్‌రెడ్డి, బోథ్‌ ఇన్‌చార్జి అడె గజేందర్‌, గండ్రాత్‌ సుజాత, సాజిత్‌ఖాన్‌ పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇక పార్టీపై అసంతృప్తితో బోథ్‌ మాజీ ఎమ్మెల్యే బాపురావు ఇటీవల కవిత ఏర్పాటు చేసిన పార్టీలో చేరగా, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఒకే ఒక్కరికి దక్కిన పోస్టు

మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌, ఖానాపూర్‌ పరిధిలో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నారు. చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రకటించినప్పటికీ బాధ్యతలు స్వీకరించలేదు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన కొట్నాక తిరుపతి గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్‌ (జీసీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భారత్‌ జోడో యాత్ర సమయంలో తిరుపతి వెంట ఉన్నారు. ఆయనకు ఢిల్లీ నుంచి మద్దతు ఉండడంతో ఒక్కరికే నామినేటెడ్‌ పదవి దక్కింది.

‘మాజీ’ల ఆశలు గల్లంతు

ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధుల ఆశలు గల్లంతయ్యాయి. వీరిలో సీనియర్‌ మాజీమంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాల చారీ, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, మాజీ ఎంపీ సోయం బాపూరావు, తదితర మాజీ ప్రజాప్రతినిధులకు నామినేటెడ్‌ పదవుల్లో ఆవకాశం రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement