ఖర్జెల్లిలో ‘పోడు’ ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

ఖర్జెల్లిలో ‘పోడు’ ఉద్రిక్తత

May 10 2026 8:10 AM | Updated on May 10 2026 8:10 AM

చింతలమానెపల్లి: మండలంలోని ఖర్జెల్లి రేంజ్‌ పరిధిలోగల అటవీ ప్రాంతంలో అటవీశాఖ నిర్వహిస్తున్న కందకాల తవ్వకాలను శనివారం గ్రామ రైతులు అడ్డుకున్నారు. ఖర్జెల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. ఖర్జెల్లి బీట్‌ పరిధిలో 174ఎకరాల పోడు భూములను అటవీ అధికారులు గుర్తించారు. రహదారికి ఇరువైపులా ఉన్న ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో పోడు భూములుగా గుర్తించిన భూముల్లో కందకం పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఖర్జెల్లి గ్రామ రైతులు తవ్వకాల వద్దకు చేరుకున్నారు. అటవీ అధికారులు, పొక్లెయినర్‌ను అడ్డుకున్నారు. పొక్లెయినర్‌కు అడ్డుగా పడుకోవడంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈక్రమంలో అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటవీ అధికారుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులు, అటవీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో 174 ఎకరాల భూమిలో ఒకవైపు మాత్రమే స్వాధీనం చేసుకుంటామని మిగతా భూమిలో రైతులు సాగు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో వివాదం సద్దుమణిగింది. షరతులతో రైతులకు మిగతా భూమిని పంచనున్నట్లు ఒప్పందం కుదిరింది. అటవీ అధికారులతో పాటు పోలీస్‌ సిబ్బంది, ఖర్జెల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement