వాంకిడి: ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ పేరుతో ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తుంది. యా ప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇసుక రీచ్‌ల వద్ద ఉండే అధికారి పత్రాలు పరిశీలించి ట్రాక్టర్లకు అనుమతులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం స మకూరుతున్నా క్షేత్రస్థాయిలో ఇసుక ధరలు అ మాంతం పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ము ఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై నేరుగా ప్ర భావం పడుతోంది. రూ.2వేల ట్రాక్టర్ లోడు ప్రస్తు తం రెట్టింపు అయ్యింది. దూరానికి అనుగుణంగా అదనపు చార్జీలు సైతం వసూలు చేస్తున్నారు.
మొదటి విడతలో 8,625 ఇళ్లు..
నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం జిల్లాలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 8,625 గృహాలు మంజూరు చేసింది. బేస్‌మెంట్ దశలో 3,392 ఇళ్లు ఉండగా, గోడ దశలో 1,558, స్లాబ్ వేసినవి 2,018, ఫినిషింగ్ దశలో 190 ఇళ్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం విడతలవారీగా రూ.5 లక్షలు చెల్లిస్తోంది. అయితే చాలామంది చేతిలో డబ్బులు లేక అప్పులు తీసుకుంటున్నారు. రాడ్లు, సిమెంట్, ఇటుకలు, తదితర సామగ్రి రేట్లు గణనీయంగా పెరిగాయి. స్లాబ్ కోసం వాడే లిఫ్ట్‌లు, మిల్లర్లు, మేసీ్త్రలు కూడా భారీగా రేట్లు పెంచేశారు. ‘మన ఇసుక వాహనం’ యాప్ అమలు తర్వాత ఇసుక ధరలు అమాంతం పెరిగి పేదలపై మరింత ఆర్థిక భారం పడుతోంది. మన ఇసుక వాహనం యాప్ రాకముందు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పట్లో తనిఖీలు నిర్వహించి ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కూడా రూ.1500 ఉన్న ట్రాక్టర్ లోడ్ రూ.2 వేలకు చేరింది. ఆన్‌లైన్ విధానం అమలు తర్వాత ఏకంగా రూ.4వేలకు చేరింది.
23 ఇసుక రీచ్‌లు
భవన నిర్మాణ రంగంలో ఇసుక ప్రధానమైనది. గ్రామాల సమీపంలోనే రీచ్‌లు ఉన్నా భారీగా ధర వెచ్చించాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన ఇసుక వాహనం యాప్ వచ్చాక ఆర్థిక భారం మరింతగా పెరిగిందని ఆందోళన చెందుతున్నారు. ఆసిఫాబాద్, బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం, కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, రెబ్బెన, సిర్పూర్(టి) మండలాల్లో ఇసుక లభ్యతను గుర్తించి అధికారులు యాప్‌లో వివరాలు పొందుపరిచారు. 8 మండలాల్లో 23 ఇసుక రీచ్‌లు గుర్తించారు. యాప్‌లో ఒక ట్రాక్టర్ ఇసుక లోడ్ కోసం ఇందిరమ్మ ఇల్లు అయితే రూ.114.97, ఇతర గృహ నిర్మాణాలకు అయితే రూ.774.96 యాప్‌లోనే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు ద్వారా ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే ట్రాక్టర్ యజమానులు మాత్రం ఇతరులకు తీసుకునే రేట్లే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద వసూలు చేస్తున్నారు.


