పత్తి సాగుకే జై..! | - | Sakshi
Sakshi News home page

పత్తి సాగుకే జై..!

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

● జిల్లాలో 4.52 లక్షల ఎకరాల్లో పంట సాగు అంచనా ● వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు చేసిన వ్యవసాయశాఖ

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో వానాకాలం సాగు హడావుడి మొదలైంది. యాసంగి పంటలు కోత దశలో ఉండగా, ఇప్పటికే అన్నదాతలు ఖరీఫ్‌ పంటల కోసం చేలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ 2026 ఖరీఫ్‌ సాగు ప్రణాళికను ఖరారు చేసింది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో సుమారు 4.52 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం నిర్దేశించుకుంది. ఇందులో పత్తి పంటకు రైతులు పెద్దపీట వేస్తుండగా, తర్వాత స్థానంలో వరి సాగు ఉంటుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచుతూ.. ఎరువుల కృత్రిమ కొరతకు తావులేకుండా ముందస్తుగా స్టాక్‌ సిద్ధం చేస్తున్నారు.

మూడో వంతు దూదిపంట

ఈ వానాకాలం సీజన్‌లో పంట సాగు అంచనాలు వేసిన అధికారులు, విత్తనాల కోసం ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. జిల్లాలోని రైతులు అధికంగా వర్షాధారంగా పత్తి పంటపైనే ఆధారపడుతున్నారు. ఈ ఏడాది సైతం అధికంగా పత్తి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. 4,52,202 ఎకరాల సాగు భూమిలో దాదాపు మూడోవంతు పత్తి సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. స్థానికంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఉన్న ప్రాజెక్టుల కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రైతులు వర్షాధార పంటలనే ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో మొత్తం విస్తీర్ణంలో అగ్రభాగం పత్తికే దక్కింది. పత్తి పంట 3,70,919 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నట్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. 7,40,726 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని పేర్కొన్నారు. అలాగే 42,228 ఎకరాల్లో వరి సాగుకు 11,750 క్వింటాళ్ల విత్తనాలు, 20,817 ఎకరాల్లో కంది పంట సాగుకు 800 క్వింటాళ్ల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. సోయాబీన్‌ 1,326 ఎకరాలు, మొక్కజొన్న 668 ఎకరాల్లో సాగుకు అంచనా వేయగా, మరో 11,254 ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎరువుల అవసరం ఇలా..

జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత లేకుండా అధి కారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వానా కాలం సీజన్‌లో సాధారణ సాగుకు మించి పంటలు సాగవుతాయని అంచనాలు రూపొందించిన అధికారులు, అవసరమయ్యే ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. యూరియా 60,081 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 40,000 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 10,013 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 20,027 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 20,027 మెట్రిక్‌ టన్నులు అవసరమని నివేదించారు. అలాగే జిల్లాకు కావాల్సిన ఇతర ఎరువుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదించారు.

Advertisement
 
Advertisement
Advertisement