కౌటాల: గ్రామీణ ప్రజల పాలిట ‘మినీ మార్కెట్లు’గా పేరొందిన వారసంతలు స్థానిక పంచాయతీలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే వసతుల కల్పనలో మాత్రం అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. పల్లెలు, మండల కేంద్రాల్లో ప్రాముఖ్యత ఉన్న ఈ సంతలపై సామాన్యులు కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు ఆధారపడుతుంటారు. అయితే, సరైన స్థలాలు, షెడ్లు లేకపోవడంతో వ్యాపారులు రోడ్లకిరువైపులా తాత్కాలిక డేరాలు వేసుకుని క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేస్తున్నా.. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. పైగా రోడ్ల పక్కనే దుకాణాలు నిర్వహిస్తుండటంతో సంత రోజున ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
సంతలే ఆధారం..
జిల్లాలోని 15 మండల కేంద్రాలతోపాటు పలు గ్రా మాల్లో సైతం వారసంతలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు వారసంతలకు వస్తుంటారు. చాలాచోట్ల నిత్యం కూరగాయలు దొరకవు. సంతలకు వచ్చి వారానికి సరిపడా కూరగాయలు, వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. సంతల నిర్వహణ ద్వారా పంచాయతీలకు రూ.లక్షల్లో ఆదా యం వస్తోంది. ఏటా నిర్వహించే వేలంలో ఎక్కువ పోటీ పడిన వారికి కేటాయిస్తారు. కానీ ఎక్కడా కూడా సంతల్లో ప్రత్యేక షెడ్లు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, పార్కింగ్ లేవు. అధికారుల పర్యవేక్షణ కొరవడి కౌటాల, రవీంద్రనగర్, సిర్పూర్(టి), బెజ్జూర్ మండలాల్లో వారసంత స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. స్థలం సరిపోక కొందరు వ్యాపారులు రోడ్ల పక్కన, దుకాణాల ముందు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. కొందరు దుకాణ యజమానులు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరోవైపు సంతను దక్కించుకున్న వారు కూడా వసూళ్లు చేసుకుంటున్నారు.
వసతులు లేక..
మార్చిలో జిల్లాలోని అన్ని వారసంతల నిర్వహణకు అధికారులు వేలం పాటలు నిర్వహించారు. పన్నుల ద్వారా, పన్నేతర ఆదాయంగా వారసంతల ద్వారా జిల్లాకు సుమారు రూ.7 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. వానాకాలంలో వానకు తడుస్తూ, ఎండాకాలంలో ఎండకు ఎండుతూ సరుకులు కొనాల్సిన దుస్థితి నెలకొంది. మహిళా వ్యాపారులు కనీసం మరుగుదొడ్లు లేక ఊపిరి బిగపట్టుకొని ఉంటున్నారు. వారాంతపు సంతలు జరిగే గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిధులు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. కానీ పంచాయతీ అధికారులకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో పనులు చేపట్టడం లేదు. స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడటంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, వినియోగదారులు కోరుతున్నారు. వారసంతల్లో సౌకర్యాల కల్పనపై జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిని సంప్రదించగా ఆయన స్పందించలేదు.
సంతల్లోనే కొంటాం
ప్రతీ వారం నిర్వహించే వారసంతల్లోనే కూరగాయలు, పప్పులు, నూనెలు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తాం. కౌటాల వారసంతకు కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, సిర్పూర్(టి) మండలాల నుంచి వ్యాపారులు, వినియోగదారులు వస్తున్నారు. సౌకర్యాలు లేక నేలపైనే కూర్చొని కూరగాయలు విక్రయిస్తున్నారు. లక్షల్లో ఆదాయం వస్తున్నా పట్టించుకోవడం లేదు.
– శ్రీలత, యాపలగూడ
స్థలం సరిపోవడం లేదు
కౌటాల వారసంతలో పశువులు, వీధికుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. వారసంత స్థలం ఆక్రమణకు గురికావడంతో స్థలం సరిపోవడం లేదు. చిరు వ్యాపారులు రోడ్డుపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతీ సోమవారం కౌటాలలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. నిధులను వినియోగించి అధికారులు సౌకర్యాలు కల్పించాలి.
– శంకర్, కౌటాల
వేలం ద్వారా ఆదాయం ఇలా..


