జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు రైతుల ఆసక్తి నాలుగేళ్ల క్రితం నాటిన మొక్కలకు ఆశాజనకంగా గెలలు ప్రభుత్వ రాయితీతో పెరుగుతున్న కొత్త తోటలు
ఈ ఫొటోలోని రైతు పేరు మల్లయ్య. సిర్పూర్(టి) మండలం డబ్బా గ్రామంలో నాలుగేళ్ల క్రితం 8 ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కలు నాటాడు. ఈ ఏడాది నుంచి గెలల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఒక్కో గెల 15– 20 కిలోల వరకు ఉందని రైతు వెల్లడించారు. ఇలా.. రైతులు నాలుగేళ్లపాటు ఓపికతో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే దాదాపు 25 ఏళ్లపాటు దిగుబడి పొందే అవకాశం ఉంది.
కాగజ్‌నగర్‌టౌన్: వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్‌పాం సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. సంప్రదాయ పంటల్లో పెరుగుతున్న పెట్టుబడి, నష్టాలను తప్పించుకునేందుకు ఆయిల్‌పాం సాగు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం నాటిన మొ క్కలు ప్రస్తుతం దిగుబడి ఇస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఎన్‌ఎంఈఓ– ఓపీ పథకం కింద 90 శాతం సబ్సిడీతో మొక్కలు, యంత్రాలు ఇస్తుండడంతో జిల్లాలో మరింత మంది తోటల సాగుకు ముందుకొస్తున్నారు. ఉద్యానశాఖ అధికారులు ఏటా లక్ష్యం మేర మొక్కలు నాటేందుకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం 1,334 ఎకరాల్లో సాగు ఆయిల్‌పాం తోటలు సాగువుతున్నాయి. ఇందులో అత్యధికంగా దహెగాం మండలంలో 364 ఎకరాలు, కాగజ్‌నగర్‌లో 316, రెబ్బెనలో 163 ఎకరాల్లో తోటలు ఉండగా, అత్యల్పంగా కెరమెరిలో 14 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఏజెన్సీలో తిర్యాణి మండలంలో ఇప్పటివరకు తోటలు లేవు.
ఉద్యాన శాఖ నుంచి రాయితీలు
ఆయిల్‌పాం సాగు చేసే రైతుకు నీటి సౌకర్యం ఉండాలి. అంతేకాకుండా మొక్క రూ.193 ఉండగా ప్ర భుత్వం రూ.173 రాయితీ కల్పిస్తుంది. దీంతో రైతు కు మొక్కకు కేవలం రూ. 20 చెల్లిస్తే లభిస్తుంది. ఒక ఎకరంలో 9 మీటర్ల అంతరంతో 57 మొక్కలు నా టాలి. మొక్కల సంరక్షణ, నిర్వహణకు ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లపాటు రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ఆ సమయంలో అంతర పంటలు సైతం సాగు చేసుకోవచ్చు. మొక్క నాటిన మూడో ఏడాది నుంచి దిగుబడి వస్తుంది. ఒక ఎకరానికి 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక గెల 15 కి లోల నుంచి 20 కిలోల వరకు ఉంటుంది. టన్నుకు ప్రస్తుతం రూ.23,501 ఽగిట్టుబాటు ధర ఉంది. అలాగే రైతులకు టీజీఎంఐపీ ద్వారా బిందుసేద్యం పరికరాలను సైతం రాయితీపై అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులైతే 90 శాతం, చిన్న సన్నకారు, బీసీ రైతులకు 80శాతం, ఇతరులకు 70శాతం రాయితీ కల్పిస్తున్నారు. అన్ని వర్గాల రైతులు 65శాతం రాయితీపై 25 పైపులు, 5 స్ప్రింకర్లు పొందవచ్చు.
మార్కెటింగ్ సులువు
మరోవైపు వరి, పత్తికి మద్దతు ధర దక్కకపోవడంతోపాటు చీడపీడల బెడద, పంట దిగుబడి తగ్గడంతో ఆరుకాలం శ్రమించినా లాభం ఉండటం లేదు. కానీ ఆయిల్‌పాం మార్కెటింగ్ సులువుగా ఉంటుంది. రైతులకు టన్నుకు రూ.23,500 చెల్లిస్తూ కంపెనీ ప్రతినిధులే పంటను తీసుకెళ్తారు. ట్రాన్స్‌పోర్టు భారం కూడా ఉండదు. అంతర పంటలైన పత్తి, పప్పు దినుసుల సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం సైతం ఉంటుంది.
ఇక్కడి నేలలు అనుకూలం
ఆయిల్‌పాం సాగు పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కాగజ్‌నగర్ డివిజన్‌లో 950 ఎకరాల్లో తోటలు ఉన్నాయి. నాలు గేళ్ల క్రితం మొక్కలు నాటిన రైతులకు గెలలు వస్తున్నాయి. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండటంతో కేవలం రూ.20 చెల్లించి మొక్కలు తీసుకోవచ్చు. ఇక్కడి నేలలు, భూసారం ఆయిల్‌పాం సాగుకు ఎంతో అనుకూలం. నీటి సౌకర్యం ఉన్న రైతులు ఆయిల్‌పాం సాగు చేయాలంటే వ్యవసాయాధికారులను సంప్రదించాలి.
– సుప్రజ, కాగజ్‌నగర్ డివిజన్ హార్టికల్చర్ అధికారి
మండలాల వారీగా వివరాలు
మండలం సాగు(ఎకరాల్లో)
ఆసిఫాబాద్ 54.48
రెబ్బెన 163.28
తిర్యాణి 0.00
వాంకిడి 29.10
కాగజ్‌నగర్ 316.98
కౌటాల 22.30
సిర్పూర్(టి) 45.80
బెజ్జూర్ 18.55
చింతలమానెపల్లి 39.03
దహెగాం 364.00
పెంచికల్‌పేట్ 127.88
జైనూర్ 55.18
కెరమెరి 14.63
లింగాపూర్ 64.78
సిర్పూర్(యు) 18.73
మొత్తం 1,334.68


