అమాత్యా.. ఆలకించండి | - | Sakshi
Sakshi News home page

అమాత్యా.. ఆలకించండి

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

● నేడు తుమ్మిడిహెట్టికి మంత్రి ‘జూపల్లి’ రాక.. ● సాగునీటి, పర్యాటక రంగాలపై దృష్టి సారించాలని ప్రజల వేడుకోలు

కౌటాల: ప్రాణహిత నదిపై బరాజ్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటనశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి రానున్నారు. మంత్రి పర్యటనపై జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. బరాజ్‌ నిర్మాణంలో సందిగ్ధతను తొలగించడంతోపాటు జిల్లాలో పర్యాటక అభివృద్ధి, సాగునీటి, ఇతర సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. అలాగే ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి గతంలో కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన చాలామందికి సరైన పరిహారం అందలేదు. ప్రస్తుత మార్కెట్‌ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని, భూమికి బదులుగా భూమి అందించాలని బాధిత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

‘ఉత్తి’పోతలే..

చుట్టూ జీవ నదులున్నా జిల్లా రైతంగానికి సాగునీరందని దుస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ప్రాణహిత ప్రాజెక్టు కోసం నిరీక్షిస్తున్నారు. ప్రాణహిత, వార్దా, వైన్‌గంగ నదుల ఒడ్డున గతంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా ఉన్నాయి. విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆయకట్టు భూములు బీడుగా ఉంటున్నాయి. ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తెస్తే రైతాంగానికి మేలు జరుగుతుంది. అలాగే ఇతర ప్రాజెక్టులు, చెరువుల కాలువు అధ్వానంగా మారాయి. ఏళ్లు పూడిక తీయకపోవడంతో ఆయకట్టుకు సాగు నీరందడం లేదు.

పర్యాటకంపై పట్టింపేది..?

జిల్లాలో జీవనదులతోపాటు 2,44,540 హెక్టార్లలో అందమైన అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ముఖ్యంగా కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని దట్టమైన అడవులు, పెద్దవాగు, ప్రాణహిత, వార్దా నదుల పరీవాహక ప్రాంతాలు వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్నాయి. పెద్దపులులతోపాటు ఇతర వన్యప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. ప్రాణహిత పరీవాహక ప్రాంతాన్ని ప్రత్యేక కారిడార్‌గా గుర్తించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి దొరుకుతుంది. పర్యాటక శాఖ మంత్రి దృష్టి సారించి జిల్లాను ఆదర్శ కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement