కుట్టు శిక్షణతో మహిళలకు ఉపాధి | - | Sakshi
Sakshi News home page

కుట్టు శిక్షణతో మహిళలకు ఉపాధి

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

● కలెక్టర్‌ కె.హరిత

రెబ్బెన: ఉచిత కుట్టు శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. మండల కేంద్రంలో మహిళా సాధికారత సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్‌ ఉచిత శిక్షణ శిబిరాన్ని గురువారం జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌, ఆసిఫాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇరుకుల్ల మంగతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువతులు, మహిళలు ఖాళీగా ఉంటూ ఇంటికే పరిమితం కాకుండా నచ్చి న స్వయం ఉపాధి వైపు దృష్టి సారించాలన్నారు. మహిళలు వస్త్రధారణపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, అందుకు అనుగుణంగా ఎంబ్రాయిడరీకి సైతం డిమాండ్‌ ఉందని తెలిపారు. కుట్టు మిషన్‌ శిక్షణ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ పొందిన మహిళలు మరో నలుగురికి ఉపాధి కల్పించాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను సొసై టీ అధ్యక్షురాలు కుసుమ విజయ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు సుదర్శన్‌గౌడ్‌, దుర్గం రాజేష్‌, అడప విమల పాల్గొన్నారు.

ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలి

ఆసిఫాబాద్‌: జనగణనలో భాగంగా ఈ నెల 11 నుంచి జూన్‌ 9 వరకు ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలని జనగణన రాష్ట్ర సంచాలకులు భారతి హోళికేరి అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ముఖ్య ప్రణాళిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 10లోగా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు మెటీరియల్‌ కిట్లు, గుర్తింపు కార్డులు అందించాలన్నారు. శిక్షణ బ్యాచ్‌ల హాజరు, సీఎంఎంఎస్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ హరిత, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్‌వైజర్లను నియమించి, 1,994 ఇళ్ల జాబితా బ్లాక్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. సిబ్బందికి అన్ని స్థాయిల్లో శిక్షణ పూర్తి చేశామన్నారు. సమావేశంలో జిల్లా సీఈవో వాసుదేవరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement