తడిసిన ధాన్యాన్ని చూపుతున్న రైతు శేఖర్
దహెగాం: వరిధాన్యం కొనుగోళ్లలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఓ వైపు అకాల వర్షాలు అన్నదాతలను భయాందోళనకు గురిచేస్తుండగా, అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనట్లు అట్టహాసంగా ప్రకటించినా ఇప్పటివరకు ఒక్క మండలంలో మినహా ఎక్కడా గింజ వడ్లు కొనలేదు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని కా పాడుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. వర్షానికి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం గంపలపల్లి, కొత్తూరు కొనుగోలు కేంద్రాల వద్ద నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతోనైనా జిల్లా యంత్రాంగం కొనుగో ళ్లు వేగవంతం చేస్తే రైతులకు ఊరట దక్కుతుంది.
వానకు ఆగమాగం
కొనుగోళ్లలో జాప్యంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి దహెగాం మండలంలో రైతులు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. ఆరబెట్టిన ధాన్యాన్ని ఉరుములు, మెరుపులు, గాలివానలో ప్రాణాలను పణంగా పెట్టి టార్పాలిన్లు కప్పి కాపాడుకున్నారు. గాలితీవ్రతకు కుప్పలపై కప్పిన టార్పాలిన్లు ఆగలే దు. అడుగు భాగంలోకి వర్షపు నీరు చేరి వడ్లు తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పది రోజు లు దాటినా నేటికీ గింజ కూడా కొనలేదని మండిపడ్డారు. సొసైటీల ద్వారా ఇచ్చిన టార్పాలిన్లు సరిపోక అద్దెకు తెచ్చుకున్నామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని తేమశాతం కోసం మళ్లీ ఆరబెట్టాల్సి న పరిస్థితి ఏర్పడింది. అంతేకాక మండలంలో కోత దశలో ఉన్న వరిపంట నేలకొరిగింది. పలు గ్రామాల్లో కోతలు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎలాంటి నిబంధనలు, కొర్రీలు లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
దహెగాం మండలం లగ్గాం శివారులోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్లు
40 కొనుగోలు కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా మొత్తం 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో సొసైటీ ఆధ్వర్యంలో 19, ఐకేపీ ఆధ్వర్యంలో 21 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు రెబ్బెన మండలంలో కేవలం 25 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దహెగాం, కాగజ్‌నగర్, రెబ్బెన, ఆసిఫాబాద్ తదితర మండలాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు పంటను అమ్ముకునేందుకు కేంద్రాల వద్ద ఆరబెడుతున్నారు. దహెగాం మండల కేంద్రంతోపాటు లగ్గాం, ఒడ్డుగూడ, కుంచవెల్లి, గిరవెల్లి, కర్జి, చంద్రపల్లి, పీపీరావు కాలనీ, హత్తిని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయి.


