సీఎం పర్యటన రద్దు! | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన రద్దు!

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

అనివార్య కారణాలతో తుమ్మిడిహెట్టి టూర్‌ వాయిదా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చల తర్వాత ఉండొచ్చనే అంచనా జిల్లా ప్రజలకు తప్పని నిరాశ

ఆసిఫాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన రద్దయింది. గురువారం కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బరాజ్‌ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించేందుకు రావాల్సి ఉంది. ఈ క్రమంలో కలెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితిక పంత్‌, జిల్లా యంత్రాంగం తుమ్మిడిహెట్టి వద్ద ఏర్పాట్లు సైతం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ట్రాఫిక్‌, భద్రత, జన సమూహ నియంత్రణ, వర్షాకాల పరిస్థితులపై సమీక్షించారు. కౌటాల మండలంలో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో మళ్లీ సంప్రదింపులు జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో పర్యటన రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. 150 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మాణానికి ఒప్పించేందుకు వారం రోజుల్లో సీఎం మహారాష్ట్రకు వెళ్లే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బరాజ్‌ ఎత్తుపై స్పష్టత వస్తేనే..

తుమ్మిడిహెట్టి సమీపంలో 148 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత నదిపై బరాజ్‌ నిర్మాణానికి గతంలో జరిగిన చర్చల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో బరాజ్‌ ఎత్తు 150 మీటర్లు ఉండాలని నిర్ణయించారు. ఈ ఎత్తుతో నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని ఇంజినీరింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. తద్వారా ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి, చెన్నూర్‌, మంచిర్యాల నియోజకవర్గాలకు సాగునీరందుతుంది. ఈ క్రమంలో ఎత్తు పెంపుపై సందిగ్ధతను తొలగించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కాంగ్రెస్‌ సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు త్వరలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఎత్తుపై స్పష్టత వస్తేనే ప్రాజెక్టు పనులు ముందుకు సాగే అవకాశం ఉంది.

సమస్యల పరిష్కారంపై ఆశలు

నూతనంగా ఏర్పడిన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయి. కుమురంభీం, వట్టివాగు, చెలిమెల ప్రాజెక్టుల కా ల్వలు అధ్వానంగా ఉన్నాయి. గిరిజన ప్రజలకు రహదారి సౌకర్యం లేక రాకపోలకు అవస్థలు పడుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాకు వరాలు కురిపిస్తారని, సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు ఆశపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీఎంకు సమస్యలు విన్నవించే అవకాశం దక్కేది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టేవారు. కానీ పర్యటన రద్దుతో జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారవుతుందని ఆశిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement