పీఏసీఎస్ పాలకవర్గాలు కొనసాగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జిల్లాలో 12 సహకార సంఘాలు
కాగజ్‌నగర్‌టౌన్/కౌటాల: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాత పాలకవర్గాలకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించేవరకు వారే పదవుల్లో కొనసాగనున్నారు. డిసెంబర్‌లో పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌చార్జీలను నియమించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకు పాత కమిటీలనే కొనసాగించాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం పాత చైర్మన్లను తిరిగి కొనసాగించాలని ఉత్తీర్వులు జారీ చేసింది. జిల్లాలో 12 సహకార సంఘాలు ఉండగా 155 మంది డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పాత పాలకవర్గాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇలా..
సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్‌నగర్, దహెగాం, కౌటాల, సిర్పూర్(టి) నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. దహెగాంలో కొండ్ర తిరుపతిగౌడ్, కౌటాలలో కుమురం మాంతయ్య, కాగజ్‌నగర్‌లో ఉమామహేశ్వర్‌రావు మళ్లీ చైర్మన్‌లుగా కొనసాగనున్నారు. సిర్పూర్(టి)లో మాజీ చైర్మన్ మానెపల్లి బాపు ఇటీవల మృతి చెందడంతో ఇక్కడ ఇన్‌చార్జి చైర్మన్‌గా డబ్బా గ్రామానికి చెందిన జుమిడి తులసీరాంకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో ఒక్క లింగాపూర్ మినహా మిగిలిన అన్నిచోట్ల పాత సింగిల్ విండో చైర్మన్లే బాధ్యతలు స్వీకరించనున్నారు.
20వేల మందికి సభ్యత్వం
జిల్లాలోని 12 పీఏసీఎస్‌ల్లో 20 వేల మందికి పైగా రైతులు సభ్యత్వం పొందారు. వీరికి పంటల సాగు కోసం సల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయడంతోపాటు సబ్సిడీపై విత్తనాలు, యంత్రాలు, ఎరువులు అందిస్తారు. సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్లు, సభ్యుల పదవీకాలం 2025 ఫిబ్రవరి 14తో ముగిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరు నెలలపాటు పదవీ కాలం పొడిగించింది. ఆ తర్వాత డిసెంబర్‌లో ఇన్‌చార్జీలకు బాధ్యతలు అప్పగించారు. మళ్లీ తప్పనిసరి పరిస్థితుల్లో పాత పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించనున్నారు.


