సరిహద్దే సమస్య..! | - | Sakshi
Sakshi News home page

సరిహద్దే సమస్య..!

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

‘ప్రాణహిత’ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రేపు తుమ్మిడిహెట్టికి సీఎం..! పర్యటనపై స్పష్టతనివ్వని జిల్లా అధికార యంత్రాంగం

కౌటాల: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని రైతులు 18ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తే ఆర్థికంగా వృద్ధి చెందుతామని అన్నదాతలు ఆశపడ్డారు. కానీ ఏళ్లుగా వారి ఆశలు ఆడియాసలుగానే మిగిలిపోయాయి. ఈక్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నదిపై నూతనంగా బరాజ్‌ నిర్మిస్తామని నిర్ణయం తీసుకుంది. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాణహిత నదిపై నిర్మించిననున్న బరాజ్‌ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్నారు. నది సమీపంలో జిల్లా, మండల అధికారులు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పర్యటనపై ఎలాంటి హడావుడి లేకపోవడంతో సీఎం వస్తారా.. లేదా టూర్‌ రద్దవుతుందా అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం సైతం దీనిపై స్పష్టతనివ్వడం లేదు.

వర్షాధారంగా పంటల సాగు

జిల్లాలో పెన్‌గంగ, వార్దా, ప్రాణహిత నదులున్నా సాగుకు మాత్రం చుక్కనీరు అందని దుస్థితి నెలకొంది. స్థానిక రైతులు 90 శాతం భూముల్లో ఇప్పటికీ వర్షాధారంగా వివిధ పంటలు పండిస్తున్నారు. కాలంతో సంబంధం లేకుండా ఇక్కడి నదులు జలకళతో ఉన్నా భారీ ప్రాజెక్టులు లేవు. దీంతో దేశంలోనే వెనుకబడిన జిల్లాలో ఒకటిగా కుమురం భీం ఆసిఫాబాద్‌ నిలిచిపోయింది. 20 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పుష్కలంగా నీరుందని, అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ ఆయన మరణానంతరం అధికారం చేపట్టిన ప్రభుత్వాలు ప్రాజెక్టును పట్టించుకోలేదు.

ఒప్పందం కుదిరేనా..?

తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నది సరిహద్దున మహారాష్ట్ర ఉంది. అవతలి వైపు చంద్రాపూర్‌, గడ్చిరోలి జిల్లాలోని పలు గ్రామాలు ఉన్నాయి. ఇ క్కడ ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్రలోని భూమి ముంపునకు గురవుతుందని అక్కడి ప్రభుత్వం ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. స్వరాష్ట్రంలో 2015లో అప్పటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మహారాష్ట్ర ప్రభు త్వ పెద్దలతో ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తుపై చర్చలు కూడా జరిపారు. కానీ అవి ఫలించకపోవడంతో గత ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును పట్టించుకోలేదు. మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నాలతో మహారాష్ట్ర ప్రభుత్వం బరాజ్‌ నిర్మాణానికి దిగి వస్తుందా.. అభ్యంతరం చెబుతుందా అనేది వేచి చూడాలి. మహారాష్ట్ర పెద్దలను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒప్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

సీఎం పర్యటనపై సందేహాలు

బరాజ్‌ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రానున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. ఇందుకోసం ఈ నెల 1న కలెక్టర్‌ హరితతోపాటు ఎస్పీ నితిక పంత్‌, జిల్లా ఉన్నతాధికారులు తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. సీఎం టూర్‌ కు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సభ వద్ద బారికేడ్లు, వేదిక, వీఐపీ, వీవీఐపీల గ్యాలరీ, అధికారులు, మీడియాకు పాసులు, భోజనాలు, తాగునీరు.. ఇలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇటీవల సమీక్ష సమావేశంలో ఆదేశించారు. మండల అధికారులు నాలు గు రోజులుగా హెలిప్యాడ్‌ నిర్మాణంతో పాటు వ్యవసాయ భూములను చదును చేయిస్తున్నారు. కా నీ ముఖ్యమంత్రి వస్తున్నా ఆశించిన రీతిలో హ డావుడి లేకపోవడం, ప్రజాప్రతినిధులు సైతం జనసమీకరణకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో అసలు సీఎం పర్యటన ఉందా..? రద్దవుతుందా అనే సందేహం కలుగుతోంది. దీనిపై జిల్లా అధికారులు ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. దాదాపు సీఎం పర్యటన రద్దు కావొచ్చనే చర్చ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement