కాగజ్‌నగర్‌టౌన్: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉ న్న కాజీపేట– కాగజ్‌నగర్ మీదుగా హౌరాకు నేరుగా రైలు నడపాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వ చ్చింది. హౌరా రైలు నిలిచిపోవడంతో జిల్లా నుంచి కలకత్తాకు వెళ్లే ప్రయాణికులు, ముఖ్యంగా బెంగాలీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 10న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సికింద్రాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మార్గం గుండా కలకత్తా(హౌరా)కు వారానికి కనీసం ఒక్క రైలు కూడా లేకపోవడం ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హౌరాకు ప్రయాణించాలంటే కాగజ్‌నగర్ ప్రాంతవాసులు ముందుగా కాజీపేటకు వెళ్లి అక్కడి నుంచి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతున్నారు. ప్రత్యామ్నాయంగా కొందరు మహారాష్ట్రలో ని వర్ధా వరకు వెళ్లి అక్కడి నుంచి గీతాంజలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హౌరా మెయిల్ రైళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో సమయం, ఖర్చులు రెండూ పెరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెంగాలీ కుటుంబాలకు అవసరం
కాగజ్‌నగర్ ప్రాంతంలో సుమారు 12 వేల మంది కి పైగా బెంగాలీలు నివసిస్తున్నారు. వీరికి ఈ మార్గం గుండా హౌరాకు నేరుగా రైలు అవసరం మరింత కీలకంగా మారింది. పండుగలు, అత్యవసర సందర్భాల్లో స్వస్థలాలకు వెళ్లడం కష్టసాధ్యంగా మారుతుంది. ఈ సమస్యపై ఇప్పటికే స్థానిక సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పలుమార్లు దక్షిణ మధ్య రైల్వే జోన్, రైల్వే బోర్డు అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అలాగే ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం ప్రతినిధులు కూడా పలు దఫాలుగా రైల్వే అధికారులను కలిసి కాగజ్‌నగర్ మార్గం గుండా హౌరా రైలు నడపాలని వినతి పత్రాలు అందించారు.
10న ప్రధాన మంత్రి పర్యటన
ఈ నెల 10న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సికింద్రాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పలు కీలక రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొత్త రైళ్లు, క్రమబద్ధీకరించిన సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా కాగజ్‌నగర్ మార్గం గుండా హౌరా రైలు ప్రకటిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న హౌరా రైలును మళ్లీ నడిపించాలనే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


