ఈదురుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

ఆసిఫాబాద్‌/దహెగాం: జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అరగంట పాటు కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారి చల్లబడింది. దహెగాం మండలంలో వర్షం కురవడంతో రైతులు, వారసంతకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని కాపాడుకునేందుకు అవస్థలు పడ్డారు. దుగుట లక్ష్మణ్‌, అంకులు, అల్లూరి సురేందర్‌, డొకే శంకర్‌, సామెర రాజన్న, చింతపూడి అర్జయ్య, ధర్మయ్యతోపాటు పలువురి ఇళ్ల రేకులు గాలికి ఎగిరిపోయాయి. ఇళ్లలోని వస్తువులు తడిసిపోయాయి. బామానగర్‌లో విద్యుత్‌ స్తంభా లు నేలకొరిగాయి. రేకులు ఎగిరిపోయి స్తంభాలపై పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

కురిసిన వర్షం.. తడిసిన మక్కలు

కౌటాల: మండల కేంద్రంలోని నాబార్డు గోదాం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన మక్కలు అకాల వర్షానికి తడిశాయి. పొల్లాల్లో ఉన్న మొక్కజొన్న పంట తడవకుండా రైతులు కుప్పలపై కవర్లు కప్పారు. తడిసిన మక్కలు కొనుగోలు చేయాలని కోరారు. కాగా, అకాల వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉక్కపోత, వేడి నుంచి కాస్త ఉపశమనం పొందారు.

Advertisement
 
Advertisement
Advertisement