అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దని, అధికారులు పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌తో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అర్జీలు స్వీకరించారు. పెండింగ్‌ దరఖాస్తులను సైతం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఈ నెల 10లోగా స్వీయ గణన చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నడుస్తున్న దారిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని చింతలమానెపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన డాక్‌ నారాయణ ఫిర్యాదు చేశారు. తమ పట్టా భూమిలో ఇతరులు అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని చింతలమానెపల్లి మండల కేంద్రానికి చెందిన అమృత అర్జీ అందించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కాగజ్‌నగర్‌ పట్టణంలోని మారుతినగర్‌కు చెందిన గాడె స్వాతి, రెబ్బెన మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌ వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. మొదటి జాబితాలో ఉన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని బెజ్జూర్‌ మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి ఫిర్యాదు చేయగా, తన పేరును లిస్టు 3 నుంచి మొదటి జాబితాకు మార్చాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన పూజిత దరఖాస్తు చేసుకుంది. పెంచికల్‌పేట్‌ మండలం పోతెపల్లి శివారులోని 190, 191 సర్వే నంబర్లలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని వినతిపత్రం అందించారు. తన పట్టా భూమి ఇతరుల పేరుతో నమోదైందని, వివరాలు మార్చాలని చింతలమానెపల్లి మండలం బాలాజీఅనుకోడ గ్రామానికి చెందిన శంకర్‌ దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement