‘పీఎంశ్రీ’ నిధుల్లో అవకతవకలు..! | - | Sakshi
Sakshi News home page

‘పీఎంశ్రీ’ నిధుల్లో అవకతవకలు..!

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బంది పేర్లతో స్వాహా ఉన్నతాధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదులు ఇప్పటికీ చర్యలు శూన్యం

సిర్పూర్‌(టి): ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలనే సదుద్దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంశ్రీ పాఠశాలల నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడం చర్చనీయాంశంగా మారింది. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు 2024– 25 విద్యా సంవత్సరానికి గాను రూ.13.71 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ బినామీ పేర్లను వెండర్లుగా చూపించి నిధులు సొంత అకౌంట్లోకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడే మళ్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి, ఉపాధ్యాయుడి పేరుతో నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రధానోపాధ్యాయుడే ప్రస్తుతం ఎంఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఇష్టారాజ్యంగా నిధులు స్వప్రయోజనాలకు వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

నిధులు పక్కదారి..

పాఠశాలలో నామమాత్రంగా పనులు చేపట్టి బినా మీల పేర్ల మీద నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. ప్రధానోపాద్యాయుడి భార్య అకౌంట్లోకి రూ.3,91,980, ఓ ఉపాధ్యాయుడి అకౌంట్లోకి రూ.3.28 లక్షలు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అకౌంట్‌కు రూ.2.31లక్షలు, జూనియర్‌ అసిస్టెంట్‌ అకౌంట్‌కి రూ.53వేలు మళ్లించి డ్రా చేసుకున్నారు. పనులు చేపట్టి సామగ్రి కొనుగోలు చేసిన వ్యాపార దుకా ణాలకు జీఎస్టీ బిల్లులతో చెల్లించాల్సి ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనిపై ఇప్పటి కే మండల కేంద్రానికి చెందిన పలువురు కలెక్టర్‌తో పాటు ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టలేదని స్థానికులు మండిపడుతున్నారు.

కలెక్టర్‌కు నివేదించాం..

పీఎంశ్రీ నిధుల వినియోగంపై సిర్పూర్‌(టి) జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతోపాటు జిల్లాలోని మొత్తం 18 పీఎం శ్రీ స్కూళ్ల వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది నాకు తెలియదు. – ఎల్‌.లలిత, డీఈవో

Advertisement
 
Advertisement
Advertisement