ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

ఆసిఫాబాద్‌: వరిధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, రవాణాశాఖ కమిషనర్‌ ఇల్లంబర్దితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కుప్పలను ఎత్తు ప్రాంతాల్లో ఉంచుకోవాలన్నారు. అధికారులు వాతావరణ శాఖ హెచ్చరికలను రైతులకు తెలియజేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, షామియానాలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మాయిశ్చర్‌ యంత్రాలు, ఆటోమెటిక్‌ ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్‌మిల్లులకు పంపించాలని ఎక్కడా జాప్యం జరగొద్దన్నారు. మే చివరినాటికి 80 శాతం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ కె.హరిత మాట్లాడారు. జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, జిల్లా సహకార శాఖ అధికారి మోహన్‌, డీటీవో రాంచందర్‌, మార్కెటింగ్‌ అధికారి అశ్వక్‌ అహ్మద్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

గడువులోగా సీఎంఆర్‌ అందించాలి

ఖరీఫ్‌ సీజన్‌ సీఎంఆర్‌ గడువులోగా అందించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమ వారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి ఖరీఫ్‌ సీఎంఆర్‌, వరిధాన్యం దిగుమతిపై రైస్‌మిల్లర్ల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 2025 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన బియ్యాన్ని రైస్‌ మిల్లర్లు గడువులోగా ప్రభుత్వానికి అందించాలన్నారు. 2025– 26 యాసంగి వరి ధాన్యాన్ని అర్హత గల బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు, రా రైస్‌మిల్లర్లు కేటాయించిన మేర దిగుమతి చేసుకోవాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ రజిత, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement