పల్లె బాటలో శాస్త్రవేత్తలు | - | Sakshi
Sakshi News home page

పల్లె బాటలో శాస్త్రవేత్తలు

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

● ఈ నెల 23 వరకు సాగుపై అవగాహన కార్యక్రమాలు ● జిల్లాలో 64 గ్రామాలు ఎంపిక

ఆసిఫాబాద్‌రూరల్‌: రైతులకు ఆధునిక సాంకేతికతను చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వారికి నిపుణుల సూచనలు అందించేందుకు ఏప్రిల్‌ 27 నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టింది. సాగులో వస్తున్న మార్పులు, పాటించాల్సిన పద్ధతులు, ఇతర అంశాలపై ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విద్యాలయం, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23 వరకు జిల్లాలోని 64 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వివిధ అంశాలపై అవగాహన

ఎనిమిది బృందాల్లోని సభ్యులు షెడ్యూల్‌ వారీగా పల్లెలు తిరుగుతూ అన్నదాతలతో చర్చా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బృందంలో వ్యవసాయ శాస్త్రవేత్తతోపాటు మండల వ్యవసాయధికారి, ఏఈవోలు, వ్యవసాయ విద్యార్థి ఉన్నారు. రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా పంటల సాగులో రైతులు చేస్తున్న తప్పులు, సాగు ఖర్చు తగ్గించుకునే పద్ధతులు, ఎలాంటి పంటలు పండించాలి.. మార్కెటింగ్‌ వ్యూహాల గురించి వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దొడ్డు రకం ధాన్యం తగ్గించి సన్నరకాలు పెంచడంతో పంట మార్పిడిపైనా అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా విపత్తులను తట్టుకుని దిగుబడి సాధించడం గురించి వివరిస్తున్నారు. అలాగే రసాయన ఎరువులు వీలైనంత వరకు తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్చా వేదిక నిర్వహిస్తున్నారు.

ఎంపిక చేసిన గ్రామాలు

రైతు ముంగిట్లో కార్యక్రమం కోసం జిల్లాలో 64 గ్రామాలను ఎంపిక చేశారు. ఆసిఫాబాద్‌ మండలంలోని మోతుగూడ, కోసార, గుడిగుడి, ఎల్లారం, వా వుదం, ఈదులవాడ, సిర్పూర్‌(యు) మండలం పంగిడి, రెబ్బెన మండలం రాజారం, నారాయణ పూర్‌, నంబాల, గంగాపూర్‌, కొండపల్లి, పెంచికల్‌పేట్‌ మండలం చేడ్వాయి, గుండ్లపేట్‌, బొంబాయిగూడ, లోడ్‌పల్లి, కొండపల్లి, కౌటాల మండలం తాటిపల్లి, తుమ్మిడిహెట్టి, గుడ్లబోరి, గురుడుపేట, సాండ్‌గాం, సిర్పూర్‌(టి) మండలం నవేగాం, లోనవెల్లి, లక్ష్మీపూర్‌, వేంపల్లి, సిర్పూర్‌(టి), జైనూర్‌ మండలం జంగాం, జైనూర్‌, ఉషేగావ్‌, రాసిమెట్ట, దుబ్బగూడ, వాంకిడి మండలం సవాతి, సామెలా, ఖిరిడి, లంజన్‌వీర, కోమటిగూడ, బెజ్జూర్‌ మండలంలో బెజ్జూర్‌, కుశ్నపల్లి, అంబఘాట్‌, ముంజంపల్లి, రెబ్బెన, దహెగాం మండలం కర్జి, కల్వాడ, పెసరికుంట, కొత్మీర్‌, దహెగాం, కాగజ్‌నగర్‌ మండలం జంబుగా, సీతానగర్‌, వంజిరీ, బోడేపల్లి, నజ్రుల్‌నగర్‌, చింతలమానెపల్లి మండలం బాలాజీఅనుకోడ, కోర్సిని, రణవెల్లి, కర్జవెల్లి, డబ్బా, కెరమెరి మండలం ధనోరా, సాంగ్వి, గోయగాం, కెరమెరి, తిర్యాణి మండలంలోని తిర్యాణి, గిన్నెధరి, మాణిక్యాపూర్‌ గ్రామాలను ఎంపిక చేశారు.

రైతులు హాజరుకావాలి

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 64 గ్రామాలను ఎంపిక చేశాం. అధిక దిగుబడి, పంటల సాగు విధానం, భూసారం ఆధారంగా సాగు చేసే పంటల గురించి శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. రైతులు స్థానికంగా ఉండి అవగాహన కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలి. – మిలింద్‌,

జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకుడు

Advertisement
 
Advertisement
Advertisement