కాగజ్‌నగర్‌టౌన్: యుద్ధ ప్రభావం పరోక్షంగా జిల్లా ప్రజలపై పడుతోంది. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్, నాన్ డొమెస్టిక్ సిలిండర్ల ధరను పెంచడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్టు నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. చమురు సంస్థల నెలవారీ సమీక్షలో భాగంగా శనివారం నుంచి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.1000 పెంచాయి. రూ.2350 ఉన్న సిలిండర్ ప్రస్తుతం ఒకేసారి రూ.3,350 చేరింది. 14.2 కిలోల డిమెస్టిక్ సిలిండర్ ధర కూడా గతంలో రూ.60 పెరగడంతో ప్రస్తుతం రూ.987 లభిస్తోంది.
చిరువ్యాపారులకు కష్టకాలం
ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో దాదాపు 100 హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. మండల కేంద్రాల్లోనూ నడుస్తున్నాయి. కాగజ్‌నగర్ పట్టణంలో రెండు గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో ఇండియన్ గ్యాస్ ఎజెన్సీలో 2,500 డొమెస్టిక్, 180 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో 18వేల డెమెస్టిక్ సిలింర్లు, 168 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర పెరగడంతో టీష్టాల్స్, బజ్జీల బండ్లు, చిన్న హోటళ్లు నడిపే వారికి కష్టకాలం మొదలైంది. సాధారణంగా రోజుకు రెండు సిలిండర్లు వినియోగిస్తున్నారు. ఒకేసారి రూ.వెయ్యి పెరగడంతో టిఫిన్ రేట్లు పెంచే పరిస్థితులు ఏర్పడ్డాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. రోజుకు రూ.3వేలు కేవలం సిలిండర్ వినియోగానికే వెచ్చిస్తే హోటల్ నడపడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో టిఫిన్ రేట్లు పెంచినా గిరాకీ పడిపోతుందని చెబుతున్నారు.
వినియోగదారులపైనా భారం
వాణిజ్య సిలిండర్ ధరల పెంపుతో హోటళ్లలో టీ రూ.12 నుంచి రూ.15, టిఫిన్లు రూ.40 నుంచి రూ. 50, భోజనం రూ.80 నుంచి రూ.100కు పెరిగే అవకాశం ఉంది. ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజల పై తీవ్ర భారం కానుంది. గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో కేవలం హోటల్ యజమానికే కాకుండా, ఆ హోటల్‌లో పనిచేసే సుమారు 10 మంది దినసరి కూలీలపైనా ప్రభావం చూపుతోంది.
పెంపు సరికాదు
ఉదయం 5 గంటల నుంచి హోటల్‌లో టిఫిన్లు తయారు చేయడానికి కష్టపడితే రోజుకు రెండు సిలిండర్లు కావాలి. ప్రస్తుత ధరలతో రూ.6వేలు వెచ్చించాలి. వాణిజ్య సిలిండర్ల ధర పెంపు సరికాదు. టిఫిన్ సెంటర్లు నడపడం సాధ్యం కాదు. – లక్ష్మణ్,
టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, కాగజ్‌నగర్
రోడ్డున పడతాం
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఆరు నెలల్లో రూ.800 పెరగగా, ఇప్పుడు ఒక్కసారిగా రూ.1000 పెంచారు. ఇటీవల గ్యాస్ లేక రెండు రోజులు టిఫిన్ సెంటర్ మూసివేశాను. నష్టమైనా తప్పదని సోమవారమే మళ్లీ తెరిచాను. హోటల్ కిరాయి, కరెంటుబిల్లులు, సరకుల ధరలతో రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.
– కిశోర్, హోటల్ యజమాని, కాగజ్‌నగర్


