మృత్యువే గెలిచింది..!
తాండూర్: కుమారుడి బంగారు భవిష్యత్ కోసం ఆ తల్లిదండ్రులు కన్న కలలు కల్లలయ్యాయి. బడికి వెళ్లమన్నందుకు ఆ బాలుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 24 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఈ విషాద ఘటన తాండూర్ మండలం నీలాయపల్లి గ్రామ పంచాయతీలోని ఒడ్డెర కాలనీలో చోటు చేసుకుంది. మాదారం ఎస్సై సౌజన్య తెలిపిన వివరాల మేరకు ఒడ్డెర కాలనీకి చెందిన దేవల్ల రాజేశ్, కోమలత దంపతుల కుమారుడు రుద్రహనితేజ(15) తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. డిసెంబర్ 21న పాఠశాలకు వెళ్లమని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


