రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాండూర్: మండలంలోని రేచిని రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు బెల్లంపల్లి రైల్వే హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య తెలిపారు. బుధవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి (45) రైల్వేట్రాక్ పక్కన తీవ్రమైన గాయాలతో పడిపోయాడు. స్థానికుల సమాచారంతో 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లభించలేదని, ఎరుపు రంగు బనియన్, ఆకుపచ్చ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మరి న్ని వివరాల కోసం 8712658601, 98491 98382 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
ఆత్మహత్యకు యత్నించిన లారీ డ్రైవర్..
భీమారం: ఈ నెల 13న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన లారీ డ్రైవర్ బుధవారం మృతి చెందినట్లు జైపూర్ సీఐ నవీన్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బానోత్ భీమానాయక్ (47)కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై మంగళవారం సాయంత్రం ఇంట్లోనే గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యంకోసం బుధవారం వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని తల్లి ఎంకూబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పలు రైళ్ల రాకపోకలు రద్దు
బాసర: బాసర నుంచి నవీపేట్ మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనుల నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు నిజామాబాద్, నాందేడ్ మధ్య నడిచే 77645,77646 నంబరు గల రైళ్ల రాకపోకలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11409, 11410, 11413, 11414, 17687, 17688 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. 20811, 17641, 17057, 17606, 17661 నంబరుగల రైళ్లను రెగ్యులేషన్ కింద నడపనున్నట్లు రైల్వే డీవై, సీవో ఎం దిలీప్ కుమార్‌దాస్ తెలిపారు.
పేకాడుతున్న ఐదుగురి అరెస్టు
భీమిని: మండలంలోని మల్లీడి గ్రామ పంచా యతీ శివారులో బుధవారం పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి పే కాడుతున్న అన్నపురం సంజీవ్‌గౌడ్, సంగర్సు రమేశ్‌రావు, కోట విజయ్‌కుమార్, సంగర్సు రాంకిషన్‌రావు, చిలువేరు భాస్కర్‌గుప్తాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పేకాట ముక్కలు, రూ.1,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో కానిస్టేబుళ్లు లక్ష్మ ణాచారి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి


