కొలాంల కొంగుబంగారం
నేటి నుంచి ఇందాపూర్‌లో ఉత్సవాలు
పోతురాజు, ధర్మరాజుకు ప్రత్యేక పూజలు
తెలంగాణ, మహారాష్ట్ర నుంచి తరలిరానున్న భక్తులు
కెరమెరి: కొలాం ఆదివాసీల కొంగుబంగారం.. మహిమాన్వితులు పోతురాజు, ధర్మరాజు ఉత్సవాలు కెరమెరి మండలం ఇందాపూర్ గ్రామ సమీపంలోని ఆలయంలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈ ప్రాంతానికి చెందిన సర్పంచ్ నుంచి ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధుల వరకు ఎన్నికల్లో పోటీ సమయంలో ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇదీ చరిత్ర
శతాబ్దాలకు పూర్వం ఉత్తూరుపేట్ ప్రాంతంలో ఇందాపురం వంశస్తులు(కొలాం తెగకు చెందిన సిడాం గోత్రం వారు) నివాసం ఉండేవారు. ఒక రోజు భయంకరమైన మెరుపులు మెరిసి, ఒక మహిమ గల రాయి భూమి నుంచి బయటికి వచ్చింది. దానిని మళ్లీ లోపలికి పంపించేందుకు వారు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కొద్దిరోజులపాటు ప్రయత్నించినా మళ్లీ ప్రత్యక్షం అయ్యేది. గ్రామ పెద్ద రాజు కలలోకి వచ్చి.. ‘తాను పోతురాజు, ధర్మరాజు దేవుడిని. ఇన్ని రోజులైనా తనను గుర్తించలేదా.. మీ మంచి కోసమే ప్రత్యక్షమయ్యాను. ఊరి చివరలో గుడి కట్టించి పూజిస్తే కోర్కెలు తీరుస్తా’ అని చెప్పి అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి కొలాంలు ఆ రాయిని దేవుడిగా భావించి గుడి కట్టారు. ఏటా మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందాపురం వంశస్తుల ఇంటి పేరుతోనే గ్రామాన్ని నేడు ఇందాపూర్‌గా పిలుస్తున్నారు. పోతురాజు వెలిసిన ప్రాంతంలోనే ప్రవహిస్తున్న పెద్దవాగును సింగర్‌వాడిగా పిలుస్తున్నారు.
పూజా కార్యక్రమాలు ఇలా..
ఇందాపూర్‌లో గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు సింగర్‌వాడిలో పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. రాత్రి 6 గంటలకు పోతురాజు, ధర్మరాజు దేవతలకు నైవేద్యం సమర్పించి, రాత్రి 9 గంటలకు పెద్ద దేవునికి పూజలు చేస్తారు. శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు బోనం సమర్పిస్తారు. 4 గంటలకు కట్టుకట్టడం, గుడి ప్రదక్షిణలు చేయడం, ఉదయం 7 గంటలకు భక్తులకు ఆశీర్వాదం ఇవ్వడం, ఉదయం 8 నుంచి 10 గంటల వరకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. 11 గంటలకు మైసమ్మకు పూజలు, మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారికి పూజలు చేసి సాయంత్రం 4 గంటల వరకు మొక్కులు చెల్లిస్తారు. సంప్రదాయ నృత్యాలు చేస్తారు. శనివారం ఉదయం 9:30 గంటలకు పోచమ్మకు పూజలు, సాయంత్రం 5 గంటలకు లక్ష్మీపూజ, ఆరు గంటలకు దేవతలను గుడిలోకి సాగనంపుతారు. ఈ సందర్భంగా నిర్వహించే క్రీడాపోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.


