రిజర్వేషన్లపై ఉత్కంఠ
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలు..
డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు వార్డులు కేటాయింపు
ఆశావహుల్లో టెన్షన్.. టెన్షన్
మున్సిపాలిటీల్లో పెరిగిన రాజకీయ వేడి
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించగా, ఈ నెలాఖరులో ఎన్నికల నగారా మోగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బుధవారం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీలు, డెడికేటెడ్ కమిషన్ నివేధిక ఆధారంగా బీసీలకు వార్డులు, చైర్‌పర్సన్ స్థానాలు కేటాయించారు. అయితే ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఇటీవల శాసన సభలో సవరించిన పురపాలిక చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. ఆసిఫాబాద్‌లో 20 వార్డులు, కాగజ్‌నగర్‌లో 30 వార్డులు ఉండడగా జిల్లా కేంద్రంపై చర్చ
కొత్తగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో గతంలో ఉన్న వార్డుల భౌగోళిక స్వరూపం పూర్తిగా మారింది. జిల్లా కేంద్రం గతంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉండగా ఐదేళ్లుగా ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది. గతంలో ఆసిఫాబాద్ సర్పంచ్ స్థానం ఎస్టీ రిజర్వ్ కావడంతో జనరల్ అభ్యర్థులకు అవకాశం దక్కలేదు. ఎట్టకేలకు రాజంపేట విడదీసి జన్కాపూర్, సాలెగూడ, గొడవెళ్లితో కలిసి నూతన బల్దియాను ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాన్ని విడదీయడంతో రిజర్వేషన్ మార్పుపై జనరల్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. మున్సిపల్ చైర్మన్, వార్డు స్థానాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో అనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.
కాగజ్‌నగర్‌కు ఎనిమిదిసార్లు ఎన్నికలు
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో గతేడాది జనవరి 25న మున్సిపల్ పాలకవర్గ గడువు ముగిసింది. ఏడాదిగా ప్రత్యేకాధికారి పాలనలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ కౌన్సిలర్లు తమ వార్డుల రిజర్వేషన్లు మారితే ఎక్కడి నుంచి పోటీ చేయాలని తర్జనభర్జన పడుతున్నారు. ఓటర్ల తుదిజాబితా ఆధారంగా తమకు అనుకూలమైన ఓటర్లు ఏ వార్డులో ఉన్నారు.. ఏయే సామాజిక వర్గాల ఓటర్లెంత మంది అనే దానిని పరిశీలిస్తున్నారు. కాగజ్‌నగర్‌కు ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగినా కేవలం రెండు పర్యాయాలు మాత్రమే మహిళలకు అధ్యక్ష పీఠం దక్కింది. మిగిలిన ఏడుసార్లు పురుషులే దక్కించుకున్నారు. ఇందులో ఒకసారి స్వతంత్ర, మూడు సార్లు టీడీపీ, రెండు సార్లు కాంగ్రెస్, రెండుసార్లు బీఆర్‌ఎస్ పార్టీ పీఠాన్ని దక్కించుకున్నాయి. 2020 ఎన్నికల్లో చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించారు. వార్డు స్థానాల్లో జనరల్‌కు 6, జనరల్ మహిళకు 9, బీసీ జనరల్‌కు 5, బీసీ మహిళలకు 4, ఎస్సీ జనరల్‌కు 3, ఎస్సీ మహిళకు 2, ఎస్టీ జనరల్‌కు ఒక్కటి చొప్పున కేటాయించారు.
వార్డుల కేటాయింపు ఇలా..
ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకా రం, బీసీలకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆసిఫాబాద్‌లోని 20 వార్డుల్లో ఎస్టీలకు రెండు, ఎస్సీలకు మూడు, బీసీలకు ఐదు, మహిళలకు ఆరు, ఆన్‌రిజర్వ్‌కు నాలుగు కేటాయించారు. అలాగే కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా ఎస్టీలకు ఒకటి, ఎస్సీల కు ఐదు, బీసీలకు తొమ్మిది, జనరల్‌కు తొ మ్మిది, ఆరు ఆన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు.


