ఆటలే ఆటలు
వీర్ధండిలో కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు
కౌటాల: సంక్రాంతి నేపథ్యంలో పల్లెల్లో క్రీడావాతావరణం నెలకొంది. పట్టణాల్లో స్థిరపడిన ప్రజలు గ్రామాలకు చేరుకోగా ప్రతీ ఇంట పిండి వంటలు, ముగ్గులతో సందడి నెలకొంది. పెద్దవాళ్లు పండగ జోష్‌లో ఉండగా.. యువత ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. జిల్లావ్యాప్తంగా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఎడ్లబండి పోటీలను నిర్వహిస్తున్నారు. కౌటాల మినీ స్టేడియంలో కేపీఎల్ సీజన్– 2లో భాగంగా రెండు వారాలుగా క్రికెట్ పోటీలు అభిమానులను అలరిస్తున్నాయి. కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. సాండ్‌గాం గ్రామంలో క్రికెట్ పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. కౌటాల మండలం వీర్ధండిలో సంక్రాంతి సందర్భంగా ఏటా కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి. జిల్లా వాసులతోపాటు మహారాష్ట్రకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
బాబాపూర్‌లో నేడు ఎడ్లబండి పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో గురువారం ఎడ్లబండి పందెలు, కబడ్డీ, ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఈ గ్రామంలో 2014 నుంచి సంక్రాంతి పండుగ సమయంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వాంకిడి, రెబ్బెన, కాగజ్‌నగర్, తిర్యాణి మండలతోపాటు మంచిర్యాల జిల్లా నుంచి సైతం పోటీదారులు హాజరవుతుంటారు.
జిల్లా కేంద్రంలో పతంగుల పండుగ
ఆసిఫాబాద్‌అర్బన్: వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం పతంగుల పండుగ నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు ఉదయ్‌బాబు, కార్యదర్శి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని హూలీట్రినిటీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 10 గంటలకు పతంగుల పండుగ ఉంటుందని, విజయవంతం చేయాలని వారు కోరారు.


