సాగులో రఘోత్తముడు
దహెగాం: వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపిస్తూ.. కొత్త సాంకేతికతతో వ్యవసాయం చేస్తున్నాడు దహెగాం మండల కేంద్రానికి చెందిన రఘోత్తంరెడ్డి. జీవితాన్ని పూర్తిగా పంటల సాగుకు అంకితం చేసి, పొలం వద్ద ఇల్లు నిర్మించుకున్నాడు. రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాడు. దహెగాం మండలంలో 26 ఏళ్ల క్రితం స్థానిక రైతులు ఎక్కువగా జొన్న పండించేవారు. 2000లో వరంగల్ నుంచి దహెగాంకు వచ్చిన రఘోత్తంరెడ్డి భూములు సాగుకు యోగ్యంగా ఉండడంతో ఇక్కడే స్థిరపడ్డాడు. ముందుగా ఏడెకరాల్లో వరి సాగు ప్రారంభించాడు. సాగు సాధ్యం కాదని గ్రామస్తులు భయపెట్టి, పశువుల బెడద ఉంటుందని హెచ్చరించారు. అయినా వెనక్కి తగ్గలేదు. మొదట్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రంతా టార్చిలైట్‌తో పంటలకు కాపలా ఉంటూ కష్టాలు ఎదుర్కొన్నాడు.
పత్తి సాగుపైనా దృష్టి
దహెగాంలో మొదట ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి పత్తి సాగు చేసి వెళ్లిపోయాడు. అనంతరం రఘోత్తంరెడ్డి వరితోపాటు పత్తి సాగుపై దృష్టి సారించాడు. వరంగల్ నుంచి విత్తనాలను తీసుకొచ్చి పత్తి సాగు ప్రారంభించగా, స్థానిక రైతులు కూడా ముందుకొచ్చారు. 2007లో సీడ్ వరి (ఆడ, మగ) సాగును కూడా పరిచయం చేశాడు. గతేడాది ఎల్లో మిర్చి పండించగా, ప్రస్తుతం పత్తి, వరి, మిర్చి పంటల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సాగులోనే ఆనందం
నాలుగేళ్లుగా ఊరి చివర ఉన్న పొలంలోనే ఇల్లు కట్టుకున్నా. నేను వరి, పత్తి సాగు చేయడం ప్రారంభించిన తర్వాత మిగిలిన వారు పంటలు పండించడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చాయి. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలు అందించాలి. – రఘోత్తంరెడ్డి


