ప్రాణహిత.. బతుకుబాట!
మత్స్యకారుల జీవితం దుర్భరం ఆర్నెల్ల పాటు నదిలోనే నివాసం కటిక చీకటిలో కాలం వెల్లదీత మార్కెటింగ్ సౌకర్యం లేక పాట్లు
మహారాష్ట్రలోని దేవలమర్రి గ్రామానికి చెందిన ఈ మహిళ పేరు తోకల లక్ష్మి. తన కుటుంబంతో పాటు ప్రాణహిత నది తీరానికి వలస వచ్చింది. ఇక్కడే చిన్న గుడారం ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబంతో కలిసి నాటు పడవతో నదిలోకి వెళ్లి చేపలు పడుతుంటారు. పట్టిన చేపలను పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో విక్రయించి జీవనం సాగిస్తుంటారు. ఇలా అనేక కుటుంబాలు ప్రాణహిత నదిలో చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్నాయి.
పెంచికల్‌పేట్: మత్స్యకారుల కుటుంబాలు దు ర్భర స్థితిలో జీవనం సాగిస్తున్నాయి. చేపల వేట కోసం ప్రాణహిత నదిలో గుడారాలు వేసుకుని కటిక చీకటిలో పిల్లపాపలతో కాలం వెల్ల దీస్తున్నాయి. ఏళ్లుగా వృత్తిని నమ్ముకుని జీవ నం సాగిస్తున్నాయి. జిల్లాలోని సిర్పూర్(టీ), కౌటాల, బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెగాం మండలాలను ఆనుకుని ప్రాణహిత నది ప్రవహిస్తోంది. తలాయి నుంచి మొట్లగూడ వరకు పలు ప్రాంతాల్లో చేపల వేటతో సుమారు 100 గంగపుత్రుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. లోనవెల్లి, తుమ్హిడేటి, బెజ్జూర్, తలా యి, మురళీగూడ, మహారాష్ట్రలోని దేవలమర్రి, చిన్నవట్ర గ్రామాల మత్స్యకారుల కుటుంబాలవారు నది తీరంలోనే ఉంటూ నిత్యం చేపలు పడుతూ విక్రయిస్తున్నారు.
ఆరునెలలు నదిలోనే..
ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంలో పదుల సంఖ్యలో గంగపుత్రుల కుటుంబాలు తాత్కాలికంగా గుడారాలు ఏర్పాటు చేసుకున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నవంబర్ నుంచి జూన్ చివరి వరకు నదిలో ఇసుక మేట లపై జీవనం సాగిస్తారు. నాటుపడవల ద్వారా జెల్లా, బొచ్చె చేపలతో పాటు రొయ్యల వేట సాగిస్తున్నారు. పట్టిన చేపలను రొయ్యలను తె లంగాణలోని బెజ్జూర్, మహారాష్ట్రలోని అహెరి, అలపల్లి మార్కెట్లలో విక్రయిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ప్రమాదకరంగా నాటు పడవలపై..
ప్రాణహిత నదిలో నిరంతరం నీటి ప్రవాహం ఉంటుంది. అకాల వర్షాలు కురిసినపుడు నది లో నీటి ప్రవాహం పెరుగుతుంది. నిత్యం నా టు పడవల ద్వారా లోతైన ప్రాంతాలకు వేటకు వెళ్తుండగా ప్రమాదాలు జరిగే అవకాశముంది. అధునాతన వలలు లేక పాత వాటినే వినియోగిస్తుండటంతో పెద్ద చేపలు చిక్కినప్పుడు అవి తెగిపోతున్నాయి. నదిలో పట్టిన చేపలను బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ప్రాణహిత నది చేపలు కిలోకు రూ.200 పైనే పలుకుతోంది. మార్కెటింగ్ లేక తక్కువ ధరకే చేపలు అమ్ముకుంటున్నామని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటినా అధికారులు స్పందించి నూతన వలలు, వాహనాలు, అందించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.
చేపల వేటతోనే జీవనం
ప్రాణహిత నదిలో చేపల వేటనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. తరాలుగా చేపల వేటనే వృత్తిగా వస్తోంది. నదిలోనే గుడారాలు ఏర్పాటు చేసుకుని రాత్రి పూట నాటు పడవలపై వెళ్లి చేపలు పడుతున్నాం. వలకు చేపలు చిక్కితేనే పూట గడుస్తుంది. లేదా ఆరోజు పస్తులుండుడే.
– రామచంద్రు, మత్స్యకారుడు, దేవలమర్రి
ప్రభుత్వాలు ఆదుకోవాలి
చేపలవేట కోసం పిల్లాపాపలతో సుమారు ఆరునెలలు నదిలోనే జీవనం సాగిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతిలోనే రాత్రి పూట చేపలను వేటాడుతూ ప్రమాదాల బారిన పడుతున్నాం. ప్రభుత్వాలు అధునాతన పడవలు, వలలు ఉచితంగా పంపిణీ చేయాలి.
– శైలేశ్, మత్స్యకారుడు, దేవలమర్రి
ప్రాణహిత.. బతుకుబాట!
ప్రాణహిత.. బతుకుబాట!


