మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రె అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషన్లు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లతో మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, కేంద్రాల ఏర్పాటు, పన్ను వసూళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 8 వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, పరిష్కరించాలన్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు ఒకే వార్డులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపాలిటీలో ఇంటిపన్ను, ఇతర పన్నులు వందశాతం వసూలు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు గజానంద్, రాజేందర్, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.


