‘పునాది’లోనే
నిబంధనలు పాతర
ఆ సమయంలో అవస్థ
పార్కింగ్ స్థలాలు చూపించాలి
జిల్లా కేంద్రం పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటోంది. రోజురోజుకూ విస్తరిస్తున్న ఖమ్మం కార్పొరేషన్‌లో ఆ స్థాయి పార్కింగ్ స్థలాలు లేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బహుళ అంతస్తుల భవనాలు, కాంప్లెక్స్‌లు వెలుస్తున్నా.. వాహనాలు నిలిపే చోటు కరువైంది. దీంతో ప్రధాన రోడ్లు, వాణిజ్య స్థలాలే పార్కింగ్‌కు అడ్డాగా మారగా ఇతర వాహనదారులు, పాదచారులు అవస్థ పడుతున్నారు. – ఖమ్మం మయూరిసెంటర్
వాహన స్టాండ్లుగా రహదారులు
● వాణిజ్య, వ్యాపార భవనాల్లో ఏర్పాట్లు నిల్ ● జిల్లా కేంద్రంలో నానాటికీ తీవ్రమవుతున్న సమస్య
ఎక్కడైనా అదే పరిస్థితి
ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి వైరా రోడ్డు మీదుగా జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్, రోటరీనగర్ వరకు, ఇటు బోనకల్ రోడ్డు, గాంధీ చౌక్, కాల్వొడ్డు, కమాన్‌బజార్, కస్పాబజార్, సరిత క్లినిక్ సెంటర్, గట్టయ్య సెంటర్, బస్ డిపో రోడ్డు, మమత రోడ్డు, నెహ్రూనగర్ ఇలా ఏ ప్రాంతంలో చూసినా రోడ్ల వెంట పార్కింగ్ చేసిన వాహనాలే కనిపిస్తాయి. ఇంకొన్ని కాలనీల్లోనైతే నడిరోడ్డుపై డివైడర్ల రూపంలోనూ పార్కింగ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి కమాన్‌బజార్‌లోని రైల్వేగేట్ వద్ద ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే, ప్రధాన రోడ్ల వెంట ఫుట్‌పాత్‌లను సైతం ద్విచక్ర వాహనాలే ఆక్రమిస్తుండడంతో వృద్ధులు, చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. బ్యాంకులు, ఆస్పత్రులకు వెళ్లిన వారికి వాహనం నిలిపే చోటు లేకపోగా.. ఎలాగోలా పార్కింగ్ చేస్తే నిమిషాల్లో ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తున్నారు. పార్కింగ్ స్థలాలు చూపించకుండా జరిమానా విధించడం ఏమిటన్న నగరవాసుల ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు.
స్థలం ఉన్నా.. చొరవ లేక..
ఖమ్మంలోని పలుచోట్ల ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ‘పే అండ్ పార్క్’ విధానం అమలు చేస్తే ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా అధికారులు విఫలమవుతున్నారు. గతంలో రైల్వేస్టేషన్ సమీపాన, వైరా రోడ్డులోని పాత చేపలమార్కెట్, ఇందిరానగర్ ప్రాంతంలో మల్టీ లెవల్ పార్కింగ్ సముదాయాల నిర్మాణానికి చేసిన ఆలోచనలు ఆదిలోనే నిలిచిపోయాయి. నగరం స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న తరుణాన పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఆక్రమణలు తొలగించడంతోపాటు ప్రధాన ప్రాంతాల్లో పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరంపై సూచనలు వస్తున్నాయి.
బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాళ్లు నిర్మించేటప్పుడు పార్కింగ్‌కు కచ్చితంగా స్థలం కేటాయించాలనే నిబంధన ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. చాలా భవనాల్లో పార్కింగ్ కోసం చూపించిన సెల్లార్లలో షాపులు, గోదాంలు ఏర్పాటు చేసి యజమానులు అదనపు ఆదాయం గడిస్తున్నారు. దీంతో వాహనదారులకు రోడ్డు తప్ప ఎక్కడా స్థలం ఉండడం లేదు. కేఎంసీ అధికారులు భవన నిర్మాణ అనుమతులు ఇచ్చామా, లేదా అన్నట్లు వదిలేస్తుండడం సమస్యలకు కారణమవుతోంది.
ఉదయం, సాయంత్రం కస్పాబజార్, కమాన్‌బజార్‌ల్లో రద్దీ ఉంటుంది. ఇక రోడ్ల వెంట వాహనాల పార్కింగ్‌తో సమస్య పెరుగుతోంది. ఆ సమయాన వాహనం నడపాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వన్‌వే ఏర్పాటు చేసినా ఫలితం లేదు. ప్రత్యేక పార్కింగ్ పాయింట్ల ఏర్పాటుకు అధికారులు చొరవ చూపాలి.
– బానోత్ రాజేష్, నగర వాసి
ఖమ్మంలోని వైరా రోడ్డుతోపాటు ప్రధాన మార్గాల్లో పనుల నిమిత్తం వచ్చే వారు రోడ్ల వెంటే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఈ రహదారులు రద్దీగా ఉంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తేనే పాదచారులు, ఇతర వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తీరతాయి.
– సాగర్ల సాయికుమార్, వాహనదారుడు


