పల్స్‌పోలియోను ప్రారంభించిన
డీఎంహెచ్‌ఓ రామారావు
ఖమ్మంవైద్యవిభాగం: పోలియో నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో ఆదివారం మొదలైంది. జిల్లాలో 0–5 ఏళ్ల వయస్సు గల చిన్నారులు 1,31,642 మంది ఉండగా, సాయంత్రం 6గంటల వరకు 1,04,365 మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈమేరకు డీఎంహెచ్‌ఓ డి.రామారావు ఖమ్మం వెంకటేశ్వరనగర్ యూపీహెచ్‌లో పిల్లలకు చుక్కలు మందు వేసి మాట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా చుక్కల మందు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణంలో అంతా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఖమ్మం రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లలో ఏర్పాటు చేసిన పాయింట్లను డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. ప్రయాణంలో ఉన్నవారి పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మామిళ్లగూడెం యూపీహెచ్‌సీలో శిబిరాన్ని కూడా ఆయన పరిశీలించారు. సత్తుపల్లి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రదీప్, జిల్లా వ్యాక్సినేషన్ అధికారి ప్రతాప్, అధికారులు సంపత్‌కుమార్, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం: ఆర్టీసీ కార్మికులను తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మంలోని మాస్‌లైన్ కార్యాలయంలో ఆదివా రం జరిగిన యూనియన్ రీజియన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించడమే కాక రిటైర్డ్ అయిన కార్మికుల బకాయిలు చెల్లించకపోతే ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శంకర్, నిరంజన్ మాట్లాడుతూ కొన్ని సంఘాలు అధికారం కోసమే తప్ప కార్మికులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అనంతరం రీజినల్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఏ.ఉప్పలయ్య, ఏ.కృష్ణను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో నాయకులు సత్యం, కృష్ణ, కేఎస్.రెడ్డి, జేఆర్.బాబు, రవి, యుగంధర్, నాగవీర, విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఏబీఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి పుల్లంరాజు
ఖమ్మం అర్బన్: అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచార సభ(ఏబీఏపీ) రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన డాక్టర్ టీ.వీ.పుల్లంరాజు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిర్మల్ జిల్లా బాసరలో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రెండేళ్లకు గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడు అయ్యప్పదాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పుల్లంరాజు ఎన్నికయ్యారు. ఇంకా ఈ సమావేశంలో జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు బెల్లపు హరిప్రసాద్, దుశెట్టి భాస్కర్‌తో పాటు రాచ రమేష్, బేతి తిరుమలరావు, జి.శేఖర్, తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.


