వర్షం.. హర్షం | - | Sakshi
Sakshi News home page

వర్షం.. హర్షం

Jun 29 2026 5:34 AM | Updated on Jun 29 2026 5:34 AM

● పంటల సాగుకు దోహదం ● పది మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం

● పంటల సాగుకు దోహదం ● పది మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం

ఖమ్మంవ్యవసాయం: వరుణిడి కటాక్షం అన్నదాతలకు ఆనందాన్ని కలిగిస్తోంది. రెండురోజులుగా జిల్లా అంతటా కురుస్తున్న వాన పంటల సాగుకు ప్రయోజనకరంగా మారుతోంది. వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆదివారం ఉద యం వరకు జిల్లాలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూన్‌ నెల సాధారణ వర్షపాతం 119.3 మి.మీలు కాగా 28వ తేదీ ఉదయం 8–30 గంటల వరకే 134.7 మి.మీ. నమోదైందని వెల్లడించారు.

అక్కడ లోటే..

జిల్లాలోని కామేపల్లి, ఖమ్మం రూరల్‌, నేలకొండపల్లి, ముది గొండ, చింతకాని, ఏన్కూరు, కల్లూరు, తల్లాడ, వైరా, బోనకల్‌ మండలాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఇక రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్‌, కొణిజర్ల, పెనుబల్లి, వేంసూరు, మధిర మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సింగరేణి, తిరుమలాయపాలెం, కూసుమంచి, సత్తుపల్లి, ఎర్రుపాలెం మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైందని నివేదికలో వెల్లడించారు. అయితే, ఆది వారం సాయంత్రం 4 గంటల నుంచి బోనకల్‌ మండలంలో భారీ వర్షం, మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షంతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశముంది. ప్రధానంగా పత్తి విస్తీర్ణం పెరుగనుందని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య వెల్లడించారు.

పొంగిపొర్లిన డ్రెయిన్లు

ఖమ్మంమయూరిసెంటర్‌/కల్లూరు రూరల్‌: ఖమ్మం లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి డ్రెయినేజీలు పొంగి పొర్లాయి. వర్షపునీటికి తోడు మురుగు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అలాగే, కల్లూరు మండలం చిన్న కోరుకొండిలోని పలువురి ఇళ్లలోకి వర్షపు నీరు చేరగా స్థానికులు ఎత్తిపోయాల్సి వచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement