మహిళా సంఘాలకు రైస్‌మిల్లులు | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాలకు రైస్‌మిల్లులు

Jun 29 2026 5:34 AM | Updated on Jun 29 2026 5:34 AM

● నేలకొండపల్లిలో లాంఛనంగా ప్రారంభిస్తాం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

● నేలకొండపల్లిలో లాంఛనంగా ప్రారంభిస్తాం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేలకొండపల్లి: మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులుగా చేయడంలో భాగంగా రైస్‌ మిల్లులు కూడా మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలంలోని అప్పలనరసింహాపురం, రాజారాంపేట, కోరట్లగూడెం గ్రామాల్లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.63 వేల కోట్ల వడ్డీ రుణాలు మంజూరు చేశామని తెలిపారు. అంతేకాక పెట్రోల్‌బంక్‌లు, సోలార్‌ ప్లాంట్లు కేటాయించడంతో పాటు ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయిస్తుండగా, త్వరలోనే రైస్‌మిల్లులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనతో తొలి మిల్లు నేలకొండపల్లి మహిళా సంఘానికి కేటాయించేలా కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో కొనసాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. రైతులు పండించిన ప్రతీ గింజతో పాటు తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసి వారంలోపే ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లను రెండు, మూడు, నాలుగు విడతలుగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి మంజూరు చేస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నాయని సూచన చేస్తున్నందున రైతులు పంటల సాగులో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం రాజారాంపేట గ్రామంలో చిన్నారులకు మంత్రి పల్స్‌ పోలియో చుక్కలు వేశారు. ఈకార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మార్కెట్‌ చైర్మన్‌ వెన్నపూసల సీతారాములు, కాంగ్రెస్‌ నాయకులు, సర్పంచ్‌లు బచ్చలకూరి నాగరాజు, గోవిందరావు, గరిడేపల్లి రామారావు, జెర్రిపోతుల సత్యనారాయణ, మామిడి వెంకన్న, పాకనాటి కన్నారెడ్డి, చెరుకుపల్లి రాజేష్‌, ఎం.వెంకన్న, కడియాల నరేష్‌, రాయపుడి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement