టీపీఎస్‌లకు ఎస్‌! | - | Sakshi
Sakshi News home page

టీపీఎస్‌లకు ఎస్‌!

Jun 25 2026 12:06 AM | Updated on Jun 25 2026 12:06 AM

నాలుగు ఎకరాల్లో నయాబజార్‌

ఉమ్మడి జిల్లాలో నాలుగు పాఠశాలల ఎంపిక

సౌకర్యాల పరిశీలనలో నిమగ్నమైన అధికారులు

ఖమ్మం సహకారనగర్‌: రాష్ట్రప్రభుత్వం విద్యావ్యవస్థల్లో తీసుకొస్తున్న మార్పుల్లో భాగంగా తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల(టీపీఎస్‌) ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందులో నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు బోధించనుండగా, ఉమ్మడి జిల్లాలో వచ్చే సంవత్సరం నాలుగు టీపీఎస్‌ల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో టీపీఎస్‌ల ఏర్పాటుకు సరిపడా స్థలం, భవనాలు ఉన్న నాలుగు పాఠశాలలను ఇప్పటికే గుర్తించగా, పాఠశాలల విస్తీర్ణం, తరగతి గదులు, ఏ మండలం, ఏ నియోజకవర్గం పరిధిలో ఉందనే వివరాలో జిల్లా విద్యాశాఖ రూపొందించిన నివేదికలను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించారు. ఈ నివేదికల ఆధారంగా పరిశీలించడమే కాక ఇంకా ఏమైనా వసతులు కల్పించాలన్న అన్న అంశాన్ని తేల్చేందుకు డ్రోన్‌ కెమెరా ద్వారా వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఈమేరకుక్షేత్రస్థాయి పరిశీలన కోసం ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పి.మదన్‌మోహన్‌ను నియమించారు. దీంతో ఆయన రెండు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు.

నివేదికల ఆధారంగా పరిశీలన

టీపీఎస్‌ల ఏర్పాటుకు మధిర మండలం మహదేవపురం, ఖమ్మంలోని నయాబజార్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కూసుమంచి హైస్కూల్‌తో పాటు భద్రాద్రి జిల్లాలోని చుంచుపల్లి హైస్కూల్‌ను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలతో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా జేడీ మదన్‌మోహన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ప్రత్యేక ఫార్మాట్‌లోని వివరాలను సరిపోల్చుకుంటున్నారు. ఈ పరిశీలనలో ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు కూడా పాల్గొంటూ, ఇంకా ఏమేం నిర్మాణాలు చేపట్టాలి, అందుకు ఎంత సమయం పడుతుందో కూడా అంచనా వేస్తున్నారు. ఈమేరకు కూసుమంచి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పరిశీలించగా, బుధవారం అధికారులు ఖమ్మంలోని నయబజార్‌ ప్రభుత్వ హైస్కూల్‌ను పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఆవరణలోని ప్రీ ప్రైమరీ పాఠశాల, ప్రైమరీ పాఠశాల, హైస్కూల్‌ స్కూల్‌, భవిత కేంద్రాన్ని సందర్శించడమే కాక విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులు, గదులు, టీపీఎస్‌ మొదలైతే పెరిగే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కావాల్సిన వసతులపై చర్చించారు.

ఖమ్మం నయాబజార్‌ ప్రభుత్వ పాఠశాల, జూనియర్‌ కళాశాల సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇందులోని హైస్కూల్‌లో 260, ప్రైమరీ స్కూల్‌లో 160, భవిత కేంద్రంలో 24మంది, జూనియర్‌ కళాశాలలో 450మంది వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఈక్రమాన విభాగాల వారీగా ఎన్ని భవనాలు, గదులు ఉన్నాయి, ఎంత ఫర్నీచర్‌ ఉంది.. ఇంకా ఏమేం కావాలో అధికారులు వివరాలు నమోదు చేసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.16.05కోట్ల నిధులతో టీపీఎస్‌ ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చనున్నట్లు తెలిసింది. ఈ పరిశీలనలో జేడీ మదన్‌మోహన్‌ వెంట డీఈఓ కార్యాలయం ఏడీ చావా శ్రీనివాసరావు, ఈడబ్ల్యూఐడీసీ(ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఈఈ బుగ్గయ్య, ఏఈ సురేందర్‌రెడ్డి, ఖమ్మం అర్బన్‌ ఎంఈఓ శైలజాలక్ష్మి, పాఠశాల హెచ్‌ఎం ఉషారాణి, అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు కార్యాచరణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement