అంగన్‌వాడీల్లో హడావుడి! | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో హడావుడి!

Jun 25 2026 12:06 AM | Updated on Jun 25 2026 12:06 AM

● పదోన్నతులు, బదిలీలకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ● ఇది పూర్తయ్యాక ఖాళీల భర్తీ కూడా.. ● త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదలకు కసరత్తు

ప్రాజెక్టుల వారీగా టీచర్లు,

హెల్పర్ల ఖాళీల వివరాలు

రెండు రోజుల్లో ఓకే..

● పదోన్నతులు, బదిలీలకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ● ఇది పూర్తయ్యాక ఖాళీల భర్తీ కూడా.. ● త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదలకు కసరత్తు

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీల ప్రక్రియ తుది దశకు చేరింది. అంగన్‌వాడీ హెల్పర్లు(ఆయా)గా పనిచేస్తూ అర్హత కలిగిన వారికి టీచర్లుగా పదోన్నతి కల్పించడమే కాక బదిలీల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా పూర్తిచేశాక, మిగిలిన ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్ల డించాయి.

పరిశీలన పూర్తి

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదోన్నతి, బదిలీలకు సంబంధించి ఈనెల 10నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. గడువు ముగిసిన నేపథ్యాన దరఖాస్తులన్నీ క్రోడీకరించి, అర్హుల జాబితా సిద్ధం చేశారు. రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంపై దృష్టి సారించారు.

పీజీలు చేసిన వారూ రేసులో..!

ఒకప్పుడు అంగన్‌వాడీ పోస్టులకు కనీస అర్హత పదో తరగతిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ విద్యార్హత ఉండగా, ఐదేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న హెల్పర్లు కూడా టీచర్లుగా పదోన్నతికి అర్హత సాధించారు. అయితే, ఇంటర్‌ పూర్తయిన వారే కాక ఇంకా ఉన్నత చదువులు చదివిన వారు సైతం హెల్పర్లుగా పనిచేస్తుండడం విశేషం. ఈనేపథ్యాన పీజీ పూర్తి చేసిన వారు, 10 – 18 ఏళ్ల అనుభవం కలిగిన వారూ పదోన్నతి రేసులో ఉన్నారు.

ఆ తర్వాత నోటిఫికేషన్‌

జిల్లాలో ప్రస్తుతం బదిలీల ద్వారా ఐదుగురు టీచర్లు, ఐదుగురు హెల్పర్లకు స్థానం కలుగుతుంది. అలాగే, 21 మంది హెల్పర్లు, టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశముంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక జిల్లాలోని కేంద్రాల వారీగాపై ఖాళీలపై స్పష్టత రానుంది. తద్వారా రోస్టర్‌ ఖాళీల వివరాలను కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ఆమోదంతో ప్రకటించి, రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

ప్రాజెక్ట్‌ టీచర్‌ హెల్పర్‌

కల్లూరు 28 121

కామేపల్లి 17 127

ఖమ్మం రూరల్‌ 24 132

ఖమ్మం అర్బన్‌ 10 43

మధిర 35 98

సత్తుపల్లి 24 44

తిరుమలాయపాలెం 05 105

జిల్లాలో సీఎం పర్యటన, ఎస్‌ఐఆర్‌ తదితర కారణాలతో ఉన్నతాధికారులు వరుస సమీక్షలతో బిజీగా ఉంటున్నారు. దీంతో అంగన్‌వాడీల పదోన్నతులు, బదిలీల ఫైల్‌ కదలికలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లోనే ఈ ఫైల్‌కు ఆమోదం లభిస్తుందని చెబుతున్నారు. ఆపై కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సూచనల మేరకు అధికారులు ప్రక్రియ నిర్వహణకు సిద్ధమవుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement