ఖమ్మంగాంధీచౌక్: భక్తజన సందోహం నడుమ నృసింహుడి గిరి ప్రదక్షణ వైభవంగా సాగింది. స్వామి జన్మ నక్షత్రం(స్వాతి నక్షత్రం) సందర్భంగా బుధవారం ఖమ్మంలోని స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత ఉత్సవ విగ్రహాలను పల్లకీలో గుట్ట పైనుంచి కిందకు తీసుకొచ్చి పురవీధుల్లో ఊరేగిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామిని తిరిగి ఆలయానికి చేర్చాక, రాతి కొండపై నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని పండితులు వెలిగించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్చకులు, ఉద్యోగులతో పాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బీఏఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థుల ఎంపికలో అదనపు కలెక్టర్
శ్రీనివాసరెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్: దళిత పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్)ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. బీఏఎస్ పథకం ద్వారా విద్యార్థుల ఎంపిక కోసం కలెక్టరేట్‌లో బుధవారం లాటరీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బీఏఎస్ పథకం ద్వారా పేద విద్యార్థులు కార్పొరేట్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందుతోందని తెలిపారు. ఎస్సీ డీడీ జి.జ్యోతి మాట్లాడుతూ కలెక్టర్ చొరవతో ఈ ఏడాది జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బీఏఎస్ పథకం ద్వారా విద్యార్థులకు సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. ఈవిద్యా సంవత్సరం 1వ తరగతిలో ప్రవేశానికి 255 మంది దరఖాస్తుదారుల్లో 128 మందిని, ఐదో తరగతిలో ప్రవేశాలకు 163మంది దరఖాస్తు చేసుకోగా లాటరీ ద్వారా 131 మందిని ఎంపిక చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాలుగు ఇసుక ట్రాక్టర్ల సీజ్
తిరుమలాయపాలెం: మండలంలోని ముజాహిదిపురం పరిధి పాలేరు ఏటి నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు సీజ చేశారు. అలాగే, ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జగదీష్ తెలిపారు.
గంజాయి స్వాధీనం
చుంచుపల్లి: మండలంలోని రామాంజనేయ కాలనీ సమీప చెరువు కట్ట ప్రాంతంలో 108 గ్రాముల గంజాయి, ఐదుగురు వ్యక్తులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహించగా, రామాంజనేయ కాలనీకి చెందిన మబ్బు అవినాష్, దొమ్మేటి మధు, కె.సాయిగణేష్, ఖాజా పాషా, రామవరం నాగయ్యగడ్డకు చెందిన భూపతి ఉదయ్ కిరణ్ గంజాయి సేవించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి రూ.5,800 విలువ చేసే గంజాయి చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
కడుపునొప్పితో
చిన్నారి మృతి
పాల్వంచరూరల్: కడుపునొప్పితో ఓ చిన్నారి బుధవారం మృతి చెందాడు. ఒడిశా నుంచి వల స వచ్చిన బాగు రాజేష్, సుమిత్ర మండల పరిధిలోని తోగ్గూడెం క్వారీల్లో పని చేస్తున్నారు. వీరి కుమారుడు ఒకటో తరగతి చదివే రుతిక్ కుమార్(6) మంగళవారం నుంచి తీవ్రంగా కడుపునొప్పితో బాధపడుతుండగా ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఫలితం లేక వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.


