రఘునాథపాలెం: ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం వైపు అనుమతి లేకుండా తరలిస్తున్న 112 టన్నుల ఇసుకను రఘునాథపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ఇసుక రవాణాకు ఉపయోగించిన మూడు లారీలు, ఎస్కార్ట్‌గా వినియోగించిన కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు ముఠా సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం వివరాలు వెల్లడించారు. మండలంలో సోమవారం చేపట్టిన తనిఖీల్లో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట రీచ్ నుంచి అనుమతి లేకుండా మూడు లారీల్లో ఇసుకను ఖమ్మం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు నందిగామ, అన్నసాగర్ ప్రాంతాలకు చెందిన పాములపాటి గోపాలకృష్ణ, ఉమ్మినేని గోపి, బండ్ల కృష్ణ, దాసరి రామకృష్ణ, బండ్ల రామకృష్ణతో పాటు లారీ డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేయడమే కాక మూడు లారీలు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఏపీలో తక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేసి, ఖమ్మం సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితుల్లో పాములపాటి గోపాలకృష్ణపై తెలంగాణ, ఏపీలో ఇప్పటికే 12 కేసులు ఉండగా, పలు కేసుల్లో శిక్ష అనుభవించినా తీరు మారలేదని తెలిపారు. అలాగే దాసరి కృష్ణపైనా కేసులు ఉన్నాయని సీఐ వెల్లడించారు.
మూడు లారీలు, ఎస్కార్ట్ కారు స్వాధీనం


