మంత్రి దామోదర రాజనర్సింహకు
పీఓ విన్నపం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఏజెన్సీ పరిధిలో డాక్టర్ల కొరత తీర్చడానికి, పీహెచ్‌సీల నిర్మాణం, వైద్య పరికరాలు, మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.20 కోట్ల నిధులు అవసరమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహల్ వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ భవనంలో వర్క్‌షాప్ నిర్వహించగా, పీఓ హాజరైన మాట్లాడారు. భద్రగిరి మార్ట్ పనితీరును వివరించగా మంత్రి ప్రశంసించారు. అనంతరం మంత్రికి గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ ఉత్పత్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి సర్వేశ్వరరావు, ఏపీఓ డేవిడ్‌రాజ్, ఏడీఎంహెచ్‌ఓ సైదులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణంపై విచారణ
అశ్వారావుపేటరూరల్: మండలంలోని తోగ్గూడెం గ్రామంలో నిర్మిస్తున్న ఓ ఆలయ నిర్మాణంపై గ్రామానికి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణాధికారిగా కొత్తగూడెం డివిజన్ దేవాదాయ శాఖ ఇన్‌స్సెక్టర్ కావూరి ఆనంద్‌ను నియమించారు. గురువారం ఆయన గ్రామంలో ఆలయ నిర్మాణంపై విచారణ చేపట్టారు. కాగా, ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించామని, నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.


