ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గుదిమళ్ల రెవెన్యూలోని సాగర్ కాల్వకు ఓ రైతు గండి కొట్టాడు. దీంతో పక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. గుదిమళ్లకు చెందిన ఇద్దరు రైతులు తమ పొలాలకు వెళ్లే బాట విషయమై గొడవ పడ్డారు. దీంతో ఒకరి కాల్వకు అవతలి వైపు ఉండగా, అటు వెళ్లకుండా ఇంకో రైతు తన పొలం పక్కనే కాల్వ పక్కగా గండి కొట్టాడు. ఫలితంగా ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలే కాక రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై గ్రామపెద్దలు రంగంలోకి దిగి రైతులకు నచ్చచెబుతున్నట్లు తెలిసింది. కాగా, ఎన్నెస్పీ ఏఈ సీతారాంప్రసాద్‌ను వివరణ కోరగా, పంట కాల్వకు, పక్కనే దారికి గండి పెట్టిన విషయం తమ దృష్టికి రాగానే పరిశీలించానని తెలిపారు. మూడు రోజుల్లోగా బాధ్యులే గండి పూడ్చకపోగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


