నేటి నుంచి సర్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సర్‌

Jun 25 2026 12:06 AM | Updated on Jun 25 2026 12:06 AM

సర్వేకు సర్వం సిద్ధం

ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, ఆ తర్వాత సేకరణ జిల్లాలో 77.62 శాతం ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి ఎస్‌ఐఆర్‌పై పార్టీల అలర్ట్‌.. బీఎల్‌ఏలకు సూచనలు

నియోజకవర్గాల వారీగా మొత్తం ఓటర్లు, మ్యాపింగ్‌ వివరాలు

1,460 మంది బీఎల్‌ఓలు

ఖమ్మం సహకారనగర్‌: జిల్లా ప్రజలకు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)పై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజతో కలిసి వివరాలు వెల్లడించారు. జిలాల్లో ‘సర్‌’కు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేయగా, గురువారం నుంచి బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే చేపడుతారని తెలిపారు. వీరి వెంట పార్టీలు నియమించిన బీఎల్‌ఏలు కూడా వెళ్తూ ఎన్యుమరేషన్‌ ఫారాలు నింపడంలో ఓటర్లకు సహకరిస్తారని చెప్పారు. బీఎల్‌ఓలకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేయగా, బీఎల్‌ఏలు తమ పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డులతో రావాలని సూచించారు. విదేశాలు, ఇతర నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న ఓటర్లు ఆన్‌లైన్‌ ద్వారా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించవచ్చని, లేదంటే వారి కుటుంబీకులు కూడా ఇవ్వొచ్చని తెలిపారు.

వీడియోలు, కరపత్రాలతో అవగాహన

ఎన్యుమరేషన్‌ ఫారాలు నింపే విధానంపై ట్యుటోరియల్‌ వీడియోలు సిద్ధం చేశామని, ఫారాలతో పాటు కరపత్రాలు కూడా ఇస్తామని కలెక్టర్‌ తెలిపారు. మ్యాపింగ్‌ పూర్తయిన వారు కూడా తప్పనిసరి ఎన్యుమరేషన్‌ ఫారం సమర్పించాలన్నారు. 2002 ఎస్‌ఐఆర్‌ జాబితాలో దేశంలో ఎక్కడ ఓటు నమోదైనా, ఆ వివరాలను ప్రస్తుతం ఉపయోగించవచ్చన్నారు. ముఖ్యంగా వివాహం అనంతరం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న మహిళలకు ఇది ఉపయోగకరమని తెలిపారు. రెండేసి చోట్ల ఓటు ఉన్న వారి గుర్తింపు నిరంతరం జరుగుతుందని, ఒకే పేరు, ఇంటిపేరు, తండ్రి పేరు వంటి వివరాలతో ఉన్న ఎంట్రీలను ఈఆర్‌ఓ నెట్‌ ద్వారా గుర్తించి, బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో విచారణ అనంతరం చర్యలు తీసుకుంటారని చెప్పారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు, తొలగించనుండగా, అర్హులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌, ఆర్డీఓ శ్రీనివాస్‌, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ అన్సారీ పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఓటర్ల జాబితా ప్రక్షాళనలో అత్యంత కీలకమైన ఇంటింట ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ గురువారం మొదలుకానుంది. ఎస్‌ఐఆర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)లో భాగంగా బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్ల గణన చేపడుతారు. ఇప్పటికే బీఎల్‌ఓలు 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను సరిపోల్చి మ్యాపింగ్‌ చేశారు. జిల్లాలో దాదాపు 77 శాతం పైగా ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తికాగా, వీరు తమ ఇంటికి వచ్చే బీఎల్‌ఓలకు ఎన్యుమరేషన్‌ ఫామ్‌ పూర్తి చేసి అందించాల్సి ఉంటుంది. మ్యాప్‌ కాని వారు ఎన్యుమరేషన్‌ ఫామ్‌తోపాటు 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి. గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు జరిగే ఈ కార్యక్రమ నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది.

మ్యాపింగ్‌లో తేడాలు

జిల్లాలో ఓటర్ల డేటా మ్యాపింగ్‌ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటివరకు 9,65,407 మంది ఓటర్ల(77.62 శాతం) వివరాలు మ్యాపింగ్‌ కాగా, ఇంకా 2,78,374 మంది మిగిలిపోయారు. అలాగే, 1,81,805 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నియోజకవర్గాల వారీగా ఖమ్మంలో అత్యధికంగా 49,510 ఓటర్ల పేర్లలో తేడాలు ఉన్నాయి. ఆ తర్వాత పాలేరులో 41,206మంది, మధిరలో 32,762మంది, సత్తుపల్లిలో 30,085 మంది ఓటర్లు, వైరాలో 28,242 మంది ఓటర్ల పేర్లలో వ్యత్యాసాలు ఉండగా.. వీటిని సరిచేస్తూ వివరాలను నూరు శాతం పక్కాగా నమోదుకు ఇంటింటి సర్వే ఉపయోగపడనుంది.

ప్రతీ ఓటరుకూ రెండేసి పత్రాలు

ఓటర్లకు ఇచ్చేందుకు గాను బీఎల్‌ఓలకు 24,87,562 ఎన్యుమరేషన్‌ ఫారాలను అందజేశారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యకు రెట్టింపు స్థాయిలో ఈ ఫారాలు పంపిణీ చేస్తారు. బీఎల్‌ఓలు ప్రతీ ఇంటికి వెళ్లి తాళం వేసి ఉంటే కనీసం మూడు సార్లు సందర్శించాల్సి ఉంటుంది. ఓటరుకు ఎన్యుమరేషన్‌ పత్రాలు రెండు ప్రతులు అందజేస్తారు. ఓటరు అందులో వివరాలను నింపాక సంతకం చేస్తే, బీఎల్‌ఓ ఒకటి తీసుకుని, రెండో ప్రతిని రశీదు సహా ఓటరుకు అందజేస్తారు. ఇక ఆన్‌లైన్‌ ద్వారా voters.eci.gov.in పోర్టల్‌లో ఓటీపీ ఽధ్రువీకరణ ప్రక్రియ కూడా పూర్తి చేసే వెసలబాటు ఉంది.

పార్టీలకూ భాగస్వామ్యం

ఓటర్ల నమోదు, సవరణలో తప్పులు జరగకుండా, పారదర్శకత పెంచేందుకు రాజకీయ పార్టీలకు కూడా ఎన్నికల సంఘం భాగస్వామ్యం కల్పించింది. ‘సర్‌’ పర్యవేక్షణకు రాజకీయ పార్టీలు బీఎల్‌ఏ (బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు)లను నియమించే వెసులుబాటు కల్పించారు. దీంతో జిల్లాలోని 1,460 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో వివిధ పార్టీల తరఫున మొత్తం 4,720 మంది బీఎల్‌ఏలను నియమించారు. వీరిలో అత్యధికంగా కాంగ్రెస్‌ తరఫున 1,431 మంది, బీఆర్‌ఎస్‌ తరఫున 1,449 మంది ఉన్నారు. ఇక బీజేపీ తరఫున 1,188 మంది, సీపీఎం తరఫున 652 మందిని నియమించారు. ఈ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓల చేపట్టే ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పరిశీలిస్తూ, ఓటర్లకు కావాల్సిన సలహాలు ఇస్తారు.

జూలె 31న ముసాయిదా జాబితా

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అందులో పేరు లేకున్నా, ఇతర అభ్యంతరాలపై ఆగస్టు 30వరకు దరఖాస్తులు స్వీకరించి, వీటిని సెప్టెంబర్‌ 28 నాటికి పరిష్కరిస్తారు. ఆపై అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. అయితే, ఎన్యుమరేషన్‌ ఫారం సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో ఉండవని అధికారులు వెల్లడించారు.

ఓటర్ల ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్‌ఓలు

నియోజకవర్గం మొత్తం ఓటర్లు మ్యాపింగ్‌ శాతం అన్‌ మ్యాపింగ్‌

ఖమ్మం 3,28,203 1,78,323 54.33 1,49,880

పాలేరు 2,45,885 2,08,393 84.75 37,492

మధిర 2,26,126 1,95,593 86.5 30,533

వైరా 1,96,475 1,64,345 83.65 32,130

సత్తుపల్లి 2,47,092 2,18,753 88.53 28,339

మొత్తం 12,43,781 9,65,407 77.62 2,78,374

జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 29 మంది ఏఈఆర్‌ఓలు, 30 మంది జిల్లా /అసెంబ్లీ లెవెల్‌ మాస్టర్‌ ట్రైనర్లు, 153 మంది సూపర్‌ వైజర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. వీరి సమన్వయంతో 1,460 మంది బూత్‌ స్థాయి అధికారులు సర్వే చేపడుతారు. జిల్లాలోని మొత్తం 1,460 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉన్న 822 ప్రాంతాలలో ఇంటింటి సర్వే సాగనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement