ప్రజలకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
చింతకాని: చింతకాని మండలం జగన్నాఽఽథపురం క్రాస్ రోడ్డు వద్ద ఈనెల 30న జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ఈమేరకు సభ విజయవంతానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. జగన్నాఽథపురంలో బుధవారం ఆయన సభ ఏర్పాట్లపై అధికారులు, నాయకులతో సమీక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మధిర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మొదటి సీఎం సభ ఇదే అయినందున, భారీగా జనసమీకరణపై కాంగ్రెస్ శ్రేణులు దృష్టి సారించాలన్నారు. రైతులు, ప్రజలకు ఇబ్బంది రాకుండా వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అధికారులకు సైతం డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. కలెక్టర్ దివాకర టీ.ఎస్., తహసీల్దార్ బాబ్జీప్రసాద్, ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మోడల్‌గా మధిర నియోజకవర్గం
బోనకల్: మధిర నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. బోనకల్ మండలంలో రూ.21.98కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే బీటీ, సీసీ రహదారుల నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. మండలంలోని చిరునోముల–వత్సవాయి మధ్య రూ.3.20కోట్లు, ముష్టికుంట్ల–గార్లపాడు మధ్య రూ.5.50కోట్లు, ఎస్సీ కాలనీలో అంతర్గత రోడ్లు రూ.73లక్షలతో, బోనకల్ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుండి చిరునోముల వరకు రూ.3.30 కోట్లు, ముష్టికుంట్ల నుంచి సీతంపేట మధ్య రూ.4.50కోట్లు, ముష్టికుంట్ల–నాగులవంచ–చొప్పకట్లపాలెం రోడ్డు రూ.4.75 కోట్లతో చేపట్టనుండగా శంకుస్థాపన చేశాక భట్టి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల మధ్య అనుసంధానం, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, విద్యుత్ లైన్ల కోసం పలువురు భట్టికి వినతిపత్రాలు అందజేశారు. అలాగే, పల్లె దవాఖానా శిథిలావస్థకు చేరడంతో జీపీ కార్యాలయంలో వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యాధికారి ప్రియాంక ఆయన దృష్టికి తీసుకెళ్లగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీ.ఎస్., ఆర్డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ సుధాకర్, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, సర్పంచ్‌లు అనుమోలు చంద్రకళ, పిల్లలమర్రి నాగేశ్వరావు, ఇరిగేషన్ డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ డీఈ వై.పీ.రాజు, నాయకులు బంధం నాగేశ్వరావు, పైడిపల్లి కిశోర్, బంధం శ్రీనివాసరావు, బోయినపల్లి వెంకటేశ్వర్లు, అమిరేశి సీతయ్య, షాజహాన్, ముస్తఫా, నవీన్, చాంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.


