బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి
● ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు ప్రయోజనం లేదు ● బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఎస్‌ఐఆర్ శిక్షణలో మాజీ మంత్రి కేటీఆర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం/సత్తుపల్లి: ‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలుచుకుంటాం.. తద్వారా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఖమ్మం జిల్లాకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా దుర్మార్గమైన పాలన పోవాలి.. కేసీఆర్ పాలన రావాలి అని జనం కోరుకుంటున్నారు.’ అని మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. సత్తుపల్లిలో బుధవారం బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ‘ఎస్‌ఐఆర్’పై నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే రెండుమెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కల్లూరు, సత్తుపల్లిల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని పేర్కొన్నారు. షాపుల్లో యూరియా స్టాక్ లేకపోగా, యాప్ పెట్టారని ఎద్దేవా చేశారు.
సీతారామ ప్రాజెక్టును ప్రారంభించాం..
కేసీఆర్ హయాంలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టామని కేటీఆర్ వెల్లడించారు. రూ.10 వేల కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు రూ.8వేల కోట్లు తాము ఖర్చు చేస్తే, 2024 ఆగస్ట్ 15న మంత్రి తుమ్మలతోపాటు ఇతర మంత్రులు వెళ్లి నీళ్లు చల్లుకున్నారన్నారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ వచ్చాకే ఈ ప్రాజెక్టును ప్రారంభించడం ఖాయమని, తద్వారా సత్తుపల్లిలో 90 వేల ఎకరాల స్థిరీకరణ జరుగతుందని పేర్కొన్నారు.
జిల్లాకు ఒనగూరిందేమిటి..?
గత ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ గెలిచి, ఆ పార్టీ ప్రభుత్వమే ఏర్పడి రెండున్నరేళ్లు అయినా జిల్లాకు చేసిందేమిటని ప్రజలు ఆలోచించాలని సూచించారు. జిల్లా మంత్రులకు ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ ఇలా కీలకమైన శాఖలు ఉన్నా ప్రజలకు ఏం ఒనగూరిందో ఆలోచన చేయాలన్నారు. రుణమాఫీ 40 పైసలే జరగగా, ఇంకా 60 పైసలు కాలేదన్నారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు అద్భుతంగా చేస్తామని ప్రభుత్వం చెబితే.. రైతులు మాత్రం కొనుగోలు కేంద్రాల వద్ద 30,40 రోజులు పడిగాపులు కాశారని, కనీసం సంచులు ఇచ్చే దిక్కు కూడా లేదని పేర్కొన్నారు.
పేదల కడుపు కొట్టారు..
ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చేసిన ఒక్క మంచి పని లేదని కేటీఆర్ తెలిపారు. ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్లను నేలమట్టం చేశారని పేర్కొన్నారు. మంత్రుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డుగా ఉన్నాయని, అందమైన విల్లాలకు అడ్డొస్తున్నాయని వేయి ఇళ్లు తొలగించి పేదల కడుపు కొట్టారని విమర్శించారు. మరోపక్క బుగ్గపాడులో దోపిడీ జరుగుతుండగా, రైతులకు రైతుబంధు రాకపోగా, యూరియా దొరకడం లేదని, అర్హులకు పింఛన్లు రావడం లేదని తెలిపారు. అభయహస్తం అంటూ చెప్పిన కథలు నమ్మి కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే ఉమ్మడి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపడితే, ఈ ప్రభుత్వం వచ్చాక పనులు ఎక్కడికక్కడే ఉన్నాయన్నారు. కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు బీఆర్‌ఎస్ గెలుచుకుంటామని తెలిపా ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం, నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, దిండిగాల రాజేందర్, బొమ్మెర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.


