గిరిజన విద్యార్థులకు బీఏఎస్‌ స్కూళ్లలో ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థులకు బీఏఎస్‌ స్కూళ్లలో ప్రవేశాలు

Jun 25 2026 12:06 AM | Updated on Jun 25 2026 12:06 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లాలోని అర్హులైన గిరిజన విద్యార్థులకు బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం(బీఏఎస్‌) అమలవుతున్న పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన అభివృద్ధి శాఖ డీడీ విజయలక్ష్మి తెలిపారు. ఈ పథకం ద్వారా 3, 5, 8వ తరగతుల్లో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు మూడో తరగతిలో తొమ్మిది సీట్లు, ఐదో తరగతిలో నాలుగు సీట్లు, ఎనిమిదో తరగతిలో మూడు సీట్ల భర్తీకి కోయ, ఎరుకల, గోండు, నాయకపోడు, లంబాడీ తెగలకు రిజర్వ్‌ చేసినట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు జూలై 6వ తేదీ లోపు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో అందజేస్తే, 7వ తేదీన భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు.

సీఎం సభ విజయవంతానికి ఇన్‌చార్జ్‌ల నియామకం

ఖమ్మంమయూరిసెంటర్‌: చింతకాని మండలంలో ఈనెల 30న జరిగే రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననుండగా, కాంగ్రెస్‌ శ్రేణులు, రైతులు, పథకాల లబ్ధిదారులు పాల్గొని జయప్రదం చేయాలని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ కోరారు. సభ జయప్రదానికి గాను నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌చార్జ్‌లు నియమించినట్లు తెలిపారు. ఖమ్మంకు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పాలేరుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, వైరాకు ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌, సత్తుపల్లికి నాయకుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించామని వెల్లడించారు.

వైటీపీఎస్‌

ప్రైవేటీకరణకు నిరసన

ఖమ్మం వ్యవసాయం: యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లోని పలు విభాగాలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై ఖమ్మం విద్యుత్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఖమ్మం పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యాన బుధవారం భోజన విరామ సమయంలో సర్కిల్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం వద్ద ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ వైటీపీఎస్‌లో విభాగాల ప్రైవేటీకరణ కారణంగా ఉద్యోగుల భద్రత, సేవలపై ప్రభావం పడుతుందన్నారు. ఈమేరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో 1104, 327 యూనియన్లతో పాటు వివిధ సంఘాల నాయకులు టి.శేషగిరిరావు, సీతారాంగోపాల్‌, ఎం.ప్రసాద్‌, విక్రమ్‌, రామకృష్ణ, సతీష్‌, కిరణ్‌, ఖాదర్‌బాబా, లక్ష్మీప్రియ, భవాని, శ్రీధర్‌, సురేష్‌, రవికుమార్‌, ఉపేందర్‌, మానస, రజిని, కిరీటి, వివేక్‌, శివరామకృష్ణారెడ్డి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల

వర్సిటీకి ఫీజు చెల్లించని కళాశాలల

ఫలితాలకు బ్రేక్‌

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఏప్రిల్‌–మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేశారు. వైస్‌ చాన్స్‌లర్‌ కె.ప్రతాప్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయగా, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ వివరాలు వెల్లడించారు. ఐదో సెమిస్టర్‌ పరీక్షలకు 12,726 మంది హాజరుకాగా 5,260మంది(41.33శాతం), ఆరో సెమిస్టర్‌ పరీక్షలకు హాజరైన 33,205 మందిలో 16,119 మంది(48.54శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. డిగ్రీ పరీక్ష ఫలితాలను కేయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని వివరించారు. కాగా, విద్యార్థులు రీవాల్యుయేషన్‌ కోసం 15రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇక సుమారు 40 కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీకి వివిధ రకాల ఫీజులు చెల్లించకపోవడం, ఆయా కళాశాలల్లోని విద్యార్థుల ఫలితాలను వెల్లడించలేదు. దీంతో వెబ్‌సైట్‌లో చూసుకున్న విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ అంశంపై యాజమాన్యాలు సంప్రదించగా, ఫీజు బకాయిల వివరాలు వెల్లడించడంతో సాయంత్రం వరకు 10 కళాశాలల బాధ్యులు చెల్లించారు. దీంతో ఆయా కళాశాలల విద్యార్థుల ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement