రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయండి

Jun 24 2026 12:05 AM | Updated on Jun 24 2026 12:05 AM

డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ

ఖమ్మంమయూరిసెంటర్‌/కామేపల్లి: చింతకాని మండలంలో ఈనెల 30న జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననుండగా, సభ జయప్రదానికి కాంగ్రెస్‌ శ్రేణులు పాటుపడాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ కోరారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ చింతకాని మండలంలో జరిగే సభావేదికగా రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలకు రైతుభరోసా నిధులు సీఎం విడుదల చేస్తారని తెలిపారు. ఈమేరకు రైతులు, జన సమీకరణకు నియోజకవర్గాలు, మండలాల వారీగా ఇన్‌చార్జిలను నియమిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు, సయ్య ద్‌ గౌస్‌, మొక్కా శేఖర్‌గౌడ్‌, పుచ్చకాయల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. కాగా, కామేపల్లి మండలం కొత్తలింగాలలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ రైతు ఆశీర్వాద సభకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ మేకల మల్లిబాబు యాదవ్‌, ఇట్టా శ్రీనివాస్‌, ధరావత్‌ అనురాధ, బానోత్‌ దీనూనాయక్‌ పాల్గొన్నారు.

టీజీఐఐసీ వివరణతో మరిన్ని సందేహాలు!

బీజేపీ నాయకుడు సుధాకర్‌రెడ్డి

ఖమ్మంమామిళ్లగూడెం: సత్తుపల్లి మండలం బుగ్గపాడు మెగా ఫుడ్‌పార్కుకు సంబంధించి భూకేటాయింపుల్లో ఆరోపణలు వస్తుండగా, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ఇచ్చిన వివరణ మరిన్ని ప్రశ్నలకు తావిచ్చిందని బీజేపీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కోఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో రైతులు అధికంగా పండించే పత్తి, మిరప తదితర పంటల ఆధారిత పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించకపోగా, లభ్యత తక్కువగా ఉన్న రొయ్యల పరిశ్రమను నెలకొల్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సదరు సంస్థ ఎప్పుడు ఏర్పడిందో ఎవరికీ అవసరం లేదని తెలిపారు. కానీ ఎప్పుడు దరఖాస్తు చేసింది, భూమి ఎప్పుడు కేటాయించారు, ఆర్థిక, సాంకేతిక పరిశీలన ఎలా జరిగిందనే అంశాలపై కచ్చితమైన వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా యువత, రైతుల అభివృద్ధికి సంబంధించిన ఈ అంశంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని సుధాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

రైతు వేదికల్లో

విత్తన విక్రయాలు

నానో యూరియా, డీఏపీ కూడా...

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో మంగళవారం విత్తన విక్రయాలు మొదలయ్యాయి. వానాకాలం సీజన్‌ ప్రారంభమైన వేళ ప్రభుత్వం సూచించిన సన్న వరి, అపరాల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 122 రైతు వేదికల్లో మంగళవారం రైతుమేళాలు ప్రారంభించారు. తొలిరోజు బీపీటీ– 5204 వరి రకం 59.4 క్వింటాళ్లు, ఆర్‌ఎన్‌ఆర్‌–15048 రకం 0.5 క్వింటాళ్లు, హెచ్‌ఎంటీ సోనా 17.4 క్వింటాళ్లు, జైశ్రీరాం రకం 0.5 క్వింటళ్లు, కేఎన్‌ఎం–7715 విత్తనాలు 2.5 క్వింటళ్లు, కేఎన్‌ఎం–1638 రకం 8.45 క్వింటాళ్ల విత్తనాలు అమ్ముడయ్యాయని అధికారులు తెలిపారు. ఇక చాలామంది రైతులు డబ్ల్యూజీఎల్‌–44(సిద్ది) రకం కోసం వచ్చినా అవి అందుబాటులో లేక నిరాశగా వెనుదిరిగారు. అంతేకాక కంది విత్తనాలు 8.89 క్వింటాళ్లు, పెసర 17.44 క్వింటాళ్లు అమ్ముడయ్యాయి. ఇక రైతు వేదికల్లో నానో యూరియా, డీఏపీ కూడా అమ్ముతుండగా మొదటి రోజు మంచి స్పందన లభించిందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు.

బోధన, మెనూ

అమలుపై దృష్టి

ఎర్రుపాలెం: విద్యార్థినులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని జీసీడీఓ రూబీ పంకజం సూచించారు. ఎర్రుపాలెంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేసిన ఆమె ఆవరణతో పాటు తరగతి, వసతిగదుల్లో పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం జీసీడీఓ మాట్లాడుతూ బోధనపై దృష్టి సారించడమే కాక మెనూ ప్రకారం విద్యార్థినులకు భోజనం సమకూర్చాలని సూచించారు. పాఠశాల సూపరింటెండెంట్‌ కె.సరిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement