కట్టించేది కాదు.. కూల్చే ప్రభుత్వమిది.. | - | Sakshi
Sakshi News home page

కట్టించేది కాదు.. కూల్చే ప్రభుత్వమిది..

Jun 24 2026 12:05 AM | Updated on Jun 24 2026 12:05 AM

ఇచ్చిన ప్లాట్లు లాక్కోవడం దుర్మార్గం

మాజీ మంత్రి హరీశ్‌రావు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘రాష్ట్రంలో ఉన్నది ఇళ్లు కట్టించే ప్రభుత్వం కాదు.. కూల్చే ప్రభుత్వం. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో కూలగొడుతున్నారు.. ఖమ్మంలో జేసీబీలు పెట్టి మొన్న వెలుగుమట్లలో, నేడు రఘునాథపాలెంలో కూలగొట్టే కార్యక్రమం చేపట్టారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు ఇళ్లు కట్టిస్తుంది. కానీ ఇందిరమ్మ రాజ్యమని చెబుతూ ప్రస్తుత పాలకులు నికృష్ట రాజ్యం చేస్తున్నారు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయనను మంగళవారం ఖమ్మంలో రఘునాథపాలెంలోని 218 సర్వేనంబర్‌లో పట్టాలు కలిగిన పలువురు కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మంత్రులు అండగా నిలుస్తారని పేదలు భావిస్తే, వారే భక్షకులుగా మారడంతో ఇబ్బంది ఎదురైందన్నారు. వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పరువుపోయిందన్నారు. అయినా ప్రభుత్వం తీరు మారకపోగా, ఇప్పుడు రఘునాథపాలెంలో కూల్చివేతలకు దిగుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాజాప్తాగా ప్లాట్‌ నంబర్‌తో సహా పట్టాలు ఇస్తే, ఇప్పుడు ఇళ్లు తొలగిస్తామనడం బాధాకరమన్నారు. మరోచోట స్థలం ఇస్తామని పేదల అభిప్రాయం తీసుకుని అదీ చేయలేదని ఆరోపించారు. కేసీఆర్‌ హయాంలో పిల్లల చదువుల ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ ఏడాదికి ఒకేసారి ఇస్తే ఇప్పుడు ఆ ఊసే లేక యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జర్నలిస్టులకు కేసీఆర్‌ ఇళ్ల స్థలాలు కేటాయించారని, వాటిని కూడా ఈ ప్రభుత్వం పెండింగ్‌ పెట్టిందన్నారు. కేబినెట్‌లో ఆమోదించి స్థలాన్ని కేటాయిస్తూ జీఓ జారీ చేయడమే కాక లే ఔట్‌ సిద్ధమైన భూమిని జర్నలిస్టులకు అప్పగించకుండా ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

పేదల పక్షాన న్యాయపోరాటం

తొలుత రఘునాథపాలెంలోని 218 సర్వేనంబర్‌ పేదల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి రఘునాథపాలెం మండలం 218 సర్వేనంబర్‌లో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో స్థలాలు ఇస్తే, బీఆర్‌ఎస్‌ హయాంలో పట్టాలు కూడా ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు మంత్రులుగా తుమ్మల, పొంగులేటి సమక్షంలోనే ఆ పట్టాల పంపిణీ జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఖమ్మం నియోజకవర్గంలో నిర్మాణాలు చేయకపోగా, కూల్చివేతలే ఎక్కువగా జరిగాయన్నారు. ఈవిషయంలో పేదల తరఫున న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జెడ్పీ మాజీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, పగడాల నాగరాజు, శీలంశెట్టి వీరభద్రం, షేక్‌ షకీనా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement