● రోడ్డు ప్రమాదాల తగ్గుదలపై విశ్లేశించాలి ● జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో నమోదైన విజయాలను నివేదికలుగా రూపొందించాలని జిల్లా ప్రత్యేక అధికారి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి, గనుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి సోమవారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో 99 రోజుల ప్రణాళికపై సమీక్షించారు. ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ అధికారులు వారి పరిధిలో సాధించిన ఫలితాలు, ప్రజలకు కలిగిన ప్రయోజనాలతో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే, పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో అందిన దరఖాస్తులు, పరిష్కరించిన సమస్యలపైనా వివరాలు సమర్పించాలని సూచించారు. ఇక అవగాహన సదస్సుల ద్వారా ప్రమాదాలు తగ్గినందున గత ఏడాది గణాంకాలతో పోల్చి చూపించాలని తెలిపారు. ఆతర్వాత గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ, ఉచిత ఇసుక సరఫరా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ వ్యవసాయ, విద్యా వారోత్సవాలతో పాటు ఇతర కార్యక్రమాల అమలును వివరించారు. ఈసమావేశంలో ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్, సీపీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వెలుగుమట్ల పేదల సొంతింటి కల సాకారం
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ లబ్ధిదారులు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులకు సహకరించాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే, లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్..కాలనీకి ప్రధాన రహదారి, నీటి వసతి, విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేశామని తెలిపారు. హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, విద్యుత్ ఎస్‌ఈ శ్రీనివాసచారి, ఈఈ జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.


